ఏప్రిల్ 11 తర్వాత కాస్త్ స్తబ్దుగా మారిన ఏపీ రాజకీయాలు... నెల రోజుల తర్వాత... సరిగ్గా ఫలితాలు వచ్చే రెండు వారాల ముందు ఒక్కసారిగా మళ్లీ వేడెక్కాయి. దీనికి కారణం... ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రధాన పార్టీల నేతలు... సమావేశాలు, సమీక్షలకు సిద్ధపడుతుండటమే. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు... నియోజకవర్గాల వారీగా గెలుపోటములపై రోజూ సమీక్షలు జరుపుతుంటే... రోజు వారీ ఎందుకు... ఒకే రోజు తేల్చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 21న సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీలూ చర్చలు, సమీక్షలకు తెరతీస్తున్నాయి. చిత్రమేంటంటే ఈ రెండు పార్టీలకూ వేటికవే పూర్తి మెజార్టీ వస్తుందనే ధీమాలో ఉన్నాయి. అంత సీన్ లేదంటున్న జనసేన... తమ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదన్న ధీమాలో ఉన్నట్లు తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగుబాబైతే... ఏకంగా పవన్ కళ్యాణే సీఎం అవుతారని ప్రకటించి సెన్సేషన్ సృష్టించారు. ఇలా జనసేన కూడా భారీ అంచనాలతో ఉంది.
పవన్ కళ్యాణ్ ఏం తేల్చుతారు : నేడు మంగళగిరిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈసారి జనసేన ఐదు ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే... మరికొన్ని సర్వేల్లో... జనసేనకు 3కి మించి అసెంబ్లీ స్థానాలు దక్కవని అంటున్నాయి. ఇంకొన్ని సర్వేలైతే... గోదావరి జిల్లాల్లో జనసేన దూసుకుపోయిందని చెబుతున్నాయి. ఇలా రకరకాలుగా వస్తున్న వార్తల్ని బేరీజు వేసుకుంటూ, నియోజకవర్గాల వారీగా గెలుపోటములపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
హంగ్ వస్తే కింగ్ : కర్ణాటకలో ఎలాగైతే హంగ్ ప్రభుత్వం ఏర్పాటైందో... ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా అధికార టీడీపీకి ప్రజల్లో క్రేజ్ తగ్గిందనీ ఐతే అది పూర్తిగా దిగజారిపోకుండా మెజార్టీకి (88 స్థానాలు) కాస్త తక్కువ స్థానాలు వస్తాయనే అంచనాల్లో జనసేన ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో వైసీపీ పుంజుకున్నా... ఇది వరకు 2014లో వచ్చిన (63) స్థానాల కంటే... మరో 10 నుంచీ 20 స్థానాలకు మించి రావనీ, అందువల్ల ఆ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని భావిస్తున్నట్లు సమాచారం. అలాంటి పరిస్థితుల్లో జనసేన లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదంటున్న ఆ పార్టీ వర్గాలు... తాము కింగ్ అవ్వాలో, కింగ్ మేకర్ అవ్వాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.
కౌంటింగ్ టెన్షన్ : ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగినప్పుడు ఎలాగైతే అక్కడక్కడా హింస, అల్లర్లు చెలరేగాయో... మే 23న కౌంటింగ్ సమయంలో కూడా అలాంటి ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చని ఇప్పటికే టీడీపీ, వైసీపీ టెన్షన్ పడుతుంటే... తాజాగా జనసేన కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. గెలవని అభ్యర్థులు ఆందోళనలకు దిగే అవకాశం ఉందనీ, ఆ అభ్యర్థుల తాలూకు కార్యకర్తలు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. అందుకే కౌంటింగ్ తేదీన ఎట్టి పరిస్థితుల్లో అల్లర్లు చెలరేకకుండా ఉండేందుకు వేటికవే తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా తమ సొంత సెక్యూరిటీని పెట్టుకుంటున్నాయి. జనసేన కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్లు తెలిసింది.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో పోలింగ్ సరళి, ఏయే స్థానాల్లో పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి తదితర అంశాలపై అభ్యర్థుల నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. 23న కౌంటింగ్ జరిగేటప్పుడు పార్టీ ప్రతినిధులు, ఏజెంట్లు ఎలా వ్యవహరించాలన్నదానిపై పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇలా అటు టీడీపీ, ఇటు వైసీపీ, జనసేన అన్ని పార్టీలూ... మే 23 కోసం సర్వసన్నద్ధం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
మా తమ్ముడు బంగారం... పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్...
IPL Final Match : ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమైన CSK, MI... జోరుగా బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందా
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?
జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janasena party, Nagababu, Pawan kalyan