అయోధ్యలో రామాలయం కడుతుంటే ఏపీలో కూల్చుతారా... పవన్ ఆగ్రహం..

అయోధ్యలో రామాలయం కడుతుంటే ఏపీలో కూల్చుతారా... పవన్ ఆగ్రహం..

పవన్ కల్యాణ్

అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతున్నవేళ ఏపీలో రాముడి విగ్రహం ధ్వంసం చేయడం దౌర్భాగ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక పద్దతి ప్రకారమే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • Share this:
  రామతీర్థ క్షేత్రంలో రాముడి విగ్రహం ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆలయాలకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై శ్రీ కోదండరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలని అన్నారు. విగ్రహం శిరస్సు కనిపించకుండా ధ్వంసం చేయడాన్ని చూసి చాలా బాధకలిగిందని పేర్కొన్నారు. ఇది మత మౌధ్యం తలెక్కిన ఉన్మాదపు చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. పిఠాపురం, కొండబిట్రగుండ, అంతర్వేది ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు.

  హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతున్నవేళ ఏపీలో రాముడి విగ్రహం ధ్వంసం చేయడం దౌర్భాగ్యమని అన్నారు. ఒక పద్దతి ప్రకారమే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రహోంశాఖ దృష్టి సారించాలని.. సీబీఐ విచారణ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
  ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పవిత్ర పుణ్య‌క్షేత్రం రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్‌ రోజువారిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనక ఎవరున్నారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.

  రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. నిందితులను పట్టుకోవడం కోసం గాలింపు చేపడుతున్నట్టు ఎస్పీ రాజకుమారి తెలిపారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు