Vizag Gas Leak | వారికి సాయం చేయండి.. జనసైనికులకు పవన్ పిలుపు

విశాఖలో గ్యాస్ లీక్, పవన్ కళ్యాన్

Vizag Gas Leak | విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు... వారందరికి ధైర్యం చెప్పాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

  • Share this:
    విశాఖపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమార్స్ లో విష వాయువులు విడుదలై ప్రజలు భీతావహులు అయిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ దుర్ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు... వారందరికి ధైర్యం చెప్పాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కసారిగా ఇళ్లు వదిలి బయటకు వచ్చేశారు... కల్యాణ మంటపాల్లోనో, సమావేశ మందిరాల్లోనో భోజన, వసతి సదుపాయం కల్పించి అండగా ఉండాలన్నారు. ఆసుపత్రుల దగ్గర హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేసి విష వాయువులు పీల్చి ఇబ్బందిపడుతున్న రోగులకు వైద్యులు, అధికారులతో సమన్వయం చేసేలా సహాయపడాలని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, విశాఖపట్నం జిల్లా నాయకులు, అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఘటన వివరాలపై చర్చించారు.

    పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఇలాంటి సమయంలో మనం రాజకీయాలు గురించి మాట్లాడకూడదు. విష వాయువుల ప్రభావంతో ఆందోళనలో ఉన్న ప్రజలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన చర్యల్లో పాల్గొనడం మన బాధ్యత. విశాఖపట్నం ప్రాంత జనసేన నాయకులు, శ్రేణులు స్పందించిన విధానం అభినందనీయం. భయకంపితులైన ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో యంత్రాంగానికి సేవలు చేశారు. ఇదే రీతిలో ఈ ఘటన తాలూకు బాధితులకు అండగా నిలవాలి. పారిశ్రామికీకరణకు, అభివృద్ధికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అయితే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు ప్రభావవంతంగా పని చేయడం లేదు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి.” అన్నారు.

    పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “విశాఖ పరిధిలోని వెంకటాపురంలోని ఎల్జీ పాలిమార్స్ నుంచి విష వాయువులు విడుదలైన ఘటన దురదృష్టకరం. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆ ప్రభావంతో పడుతున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాధాకరంగా ఉన్నాయి. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి మన అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు అక్కడి వివరాలు తెలుసుకొంటూ ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులతోపాటు నగరంలోని నాయకులు సత్వరమే స్పందించి బాధితులకు సేవలు అందిస్తున్నారు” అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: