P Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పాపికొండలు (Papikondalu Tour) ఒకటి. పాపికొండల మధ్య బోటులో ప్రయాణిస్తూ గోదారమ్మ అందాలను వీక్షిస్తుంటే ఆ అనుభూతే వేరు. ఇందుకోసం ఏపీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేవలం శీతాకాలంలో మాత్రమే పాపికొండల టూర్ అందుబాటులో ఉంటేది. కానీ ఇప్పుడు గోదారమ్మ ఒడిలో అద్భుత ప్రయాణం ఇక అన్ని సీజన్లలో ఉండబోతోంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం చాలామంది పర్యాటక ప్రేమికుల ఆశ. అలసిన మనసులకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు యాత్రకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పాపికొండలకు సాగే ఈ బోటు ప్రయాణంలో గోదావరమ్మ ఒడిలో జల విహారం చేస్తూ పర్యాటకులంతా ఆనంద పరవశులవుతారు.
ఇక వేసవిలోనూ పాపికొండల బోటుషికారు చేయొచ్చు. సాధారణంగా సంక్రాంతి వరకూ గతంలో బోటు షికారు ఉండేది. ఎందుకంటే గోదావరి నీటిమట్టం బాగా తగ్గిపోయేది. అప్పట్లో జనవరి తర్వాత పాపికొండల్లో కేవలం మూడు మీటర్ల నీటిమట్టం మాత్రమే ఉండేది. అందువల్ల ఇసుక తిప్పలకు తగిలి బోట్లు ఆగిపోయేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుతం 26 మీటర్ల నీటిమట్టం ఉంది. 27 మీ టర్ల వరకూ ఇక్కడ బోటు షికారుకు అనుమతి ఉంది.
గతంలో కేవలం 3 మీటర్లే ఉండగా, 26 మీటర్లకు నీటి మట్టం పెరగడంతో ఎండాకాలంలో కూడా బోటు షికారు చేయొచ్చు. కానీ ఎండలు, పరీక్షల సీజన్ వల్ల ఆ సమయంలో ఎంతమేరకు పర్యాటకులు వస్తారనేదే సందేహం. గోదావరిలో చల్లగా పయనించవచ్చనుకుంటే బాగానే వస్తారు. ఇదిలా ఉండగా ఈసారి సంక్రాంతి రోజులన్నీ పాపికొండల షికారుకు పండగ సందడే అయింది. సంక్రాంతి పండుగ ముందు రోజు ముక్కనుమ వరకూ పర్యాటకులు బాగా సందడి చేశారు. రోజుకు 400 మందికిపైగా పర్యాటకులు బోటు షికారు చేశారు. ప్రతీ రోజూ 5 నుంచి బోట్లు వరకూ తిరిగాయి.
సాధారణ రోజుల్లో రోజుకు కేవలం 2 బోట్లు, ఒక్కోసారి మూడు బోట్లు తిరిగేవి. సుమారు 200 మంది పర్యాటకులు వచ్చేవారు. విజయదశమి ముందు బోటు షికారు మొదలైనప్పటికీ చాలా రోజులు వాతావరణ ఇబ్బందులు, పర్యాటకులు రాకపోవడం వల్ల బోటు షికారు బోసిపోయింది. క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నారు. కరోనా ఇబ్బంది ఉన్నా రోజుకు రెండు మూడు బోట్లు నిండుతున్నాయి. భోగిరోజున ఏడు బోట్లు తిరిగాయి. ఇందులో 437 మంది పర్యాటకులు షికారు చేశారు. రెండో రోజు సంక్రాంతి రోజున ఏడు బోట్లు పర్యటించగా, అందులో 465మంది షికారు చేశారు. కనుమ రోజున ఆరు బోట్లు పర్యటించగా 455 మంది షికారు చేశారు. సోమవారం ఐదు బోట్లు మాత్రమే తిరిగాయి. ఈనెలాఖరు వరకూ ఈ సందడి బాగానే ఉండవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. తర్వాత ఎండకాలంలో కూడా బోటు షికారుకు వేసవి సెలవులు ఉపయోగపడొచ్చు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap tourism, Godavari river