P. Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు (Papikondalu Tour) ఒకటి. గోదావరి మధ్యలో పాపికొండల నడుమ యాత్ర అత్యంత ఆహ్లాదకరంగా సాగుతుంది. పాపికొండల బోట్ వస్తే అది కిటకిటలాడిపోతుంది. కానీ ఇది ఒకప్పటిమాట.. ఇప్పుడు యాత్రికులు పాపికొండలు టూర్ అంటేనే భయపడిపోతున్నారు. పాపికొండలు టూర్ కి అసలు రద్దీ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. పాపికొండలు బోటు షికారుకు పర్యాటకులు పెద్ద షాక్ ఇచ్చారు. కచ్చులూరు ప్రమాదం తర్వాత చాలా కాలం ఆగిపోయి.. ఎట్టకేలకు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా గత నెల 7వ తేదీన బోటు షికారు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట్లో కొంత స్పందన ఉంది. కానీ తర్వాత పర్యాటకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం. కార్తీక మాసం అంటే పాపికొండలు బోటు షికారుకు టికెట్ దొరకడమే కష్టంగా ఉండేది. గతంలో శని, ఆది, సోమవారాల్లో ఏకంగా 20 నుంచి 25బోట్లు తిరిగేవి.
రోజుకు 2వేల మంది పర్యటించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ ఏడు కార్తీక మాసంలో ప్రైవేట్ బోట్లపై సుమారు 1,300 మంది, టూరిజం బోట్లపై సుమారు 300 మంది మాత్రమే షికారుకు వెళ్లారు. ప్రభుత్వం గండిపోచమ్మ గుడి నుంచి 11 ప్రైవేట్ బోట్లకు అనుమతి ఇచ్చింది. ఒక టూరిజం బోటుకు కూడా అనుమతి ఉంది. ప్రైవేట్ బోట్ల ఆపరేటర్లు అసోసియేషన్‌గా ఏర్పడి పర్యాటకులను బట్టి సీరియల్ ప్రకారం బోట్లను నడుపుతున్నారు. అంటే 11 బోట్ల నిర్వాహకులు ఒక్కొక్కరు తమ బోటును నెలకు రెండుసార్లు కంటే ఎక్కువ తిప్పే అవకాశం లేదు. రోజూ ఒక బోటు నిండడమే గమనమైపోతోంది. ఒక్కో రోజున 15 నుంచి 20మంది పర్యాటకులతో కూడా బోటు నడిపామని ఓ ప్రైవేట్ బోటు నిర్వాహకుడు తెలిపారు. నడపకపోతే వచ్చేవారు కూడా రారేమోనని, నెమ్మదిగా అలవాటవుతారనే అభిప్రాయంతో నష్టం జరుగుతున్నా బోటు నడుపుతున్నామన్నారు.
చాలా కాలం తర్వాత పాపికొండలు బోటింగ్ ప్రారంభమైనప్పటికీ పర్యాటకులు ఎక్కువగా ఎందుకు రావడం లేదనేది అయోమయంగా ఉంది. ఈసారి టిక్కెట్ ధరలు బాగా పెంచారు. పెద్దలకు రూ.1,250. పిల్లలకు రూ.1,050గా నిర్ణయించారు. ఈ ధరలోనే రాజమహేంద్రవరంలో తమ వాహ నం మీద ఎక్కించుకుని, బోటు ఎక్కించి, బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ కూడా ఇస్తారు. గతంలో కేవలం రూ.750కే తీసుకుని వెళ్లేవారు. దీంతో కూడా పర్యాటకులు ముందుకు రావడం లేదా అనేది ఒక అనుమానం. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే షికారుకు పెద్దగా రావట్లేదని బోట్ల నిర్వాహకులు చెప్తున్నారు. తాము టిక్కెట్ ధర రూ.1,250 పెట్టినా, అందులో రూ.250 ట్రాన్స్‌పోర్టుకు ఇవ్వాలని, మరో రూ.50 టూరిజం శాఖకు సెస్ కట్టాలంటున్నారు. గతంలో ప్రభుత్వం పైసా కూడా కట్టించుకునేది కాదు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేది.
ఇవాళ కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసి వాటియ్యే ఖర్చును సెస్ రూపంలో వసూలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అసలు రూ.100 కట్టించుకోవాలని ప్రభుత్వం ఆలోచించింది. తాము ఇబ్బంది పడడంతో టూరిజం శాఖ మంత్రి రూ.50కే ఖాయం చేసినట్టు నిర్వాహకులు చెప్పారు. పర్యాటకులు అంతగా రాకపోవడానికి వరదలు, తుఫాను కూడా కారణమనే విశ్లేషణ ఉంది.
గడిచిన నెలల్లో వరదలు తరచూ రావడం వల్ల కొద్దిరోజులు బోట్లు ఆపేశారు. ఇటీవల తుఫాను హెచ్చరికతో మూడు రోజులు ఆగిపోయాయి. దూర ప్రాంతాల వారు టికెట్ బుక్ చేసుకుని రాజమహేంద్రవరం వస్తే సడన్‌గా బోటు షికారు రద్దయిందని చెప్పడంతో పర్యాటకులు ఇబ్బందిపడ్డారు. అసలు బోటు షికారు ఉంటుందో లేదో కూడా స్పష్టత లేకపోవడం కూడా పర్యాటకులు ఎక్కువగా రాకపోవడానికి మరో కారణం. గతంలో వరదలు ఉన్నా, వానలు వచ్చినా పర్యాటకులను ఎక్కించుకుని బోట్లు తిరిగేవి. ఇవాళ కంట్రోలు రూమ్ పెట్టడం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఎక్కువ మంది వచ్చినా ఒక బోటులో కూరేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో బోటు షికారు వచ్చే సీజనుకు పుంజుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
గతంలో డిసెంబరు తర్వాత నుంచి నెమ్మదిగా బోటు షికారు తగ్గేది. సంక్రాంతి పండగలు ముగిసేసరికి గోదావరిలో కూడా పెద్దగా నీరు ఉండేది కాదు. కానీ ఇవాళ పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్ కట్టడం వల్ల పాపికొండల్లో ఈసారి వేసవి లోనూ నీరు ఉండే అవకాశం ఉంది. పర్యాటకులు వస్తే వేసవిలో కూడా బోటు షికారు ఉండవచ్చు. తుఫాను కారణంగా మూడు రోజుల పాటు ఆగిపోయిన షికారు సోమవారం మొదలైంది. కేవలం ఒక ప్రైవేట్ బోటు మాత్రమే అరకొర పర్యాటకులతో వెళ్లింది. టూరిజం బోటు కదల్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.