(Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati)
పూర్వం నుండి పల్నాడు ప్రాంతం అంటే పౌరుషాలకు పురిటిగడ్డ. అలాంటి పల్నాడు ప్రాంతానికి చరిత్ర లో ఒక ప్రత్యేక స్థానముంది. ఇక్కడ పూర్వం రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగితే నేడు జిల్లాగా మారిన తర్వాత రాజకీయ ఘర్షణలు, ఆధిపత్యానికి కేంద్రంగా మారింది. అధికారం కోసం ఓ వర్గం, ఆధిపత్యం కోసం మరో వర్గం కత్తులు దువ్వుతూ రాజకీయ రణరంగంగా మార్చుతున్నారు. జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం(Macherla Constituency)లో రాజకీయ కక్షలు చినికి చినికి గాలివాన కాస్తా తుఫానుగా మారాయి. నియోజకవర్గంలో జల్లయ్య (Jallaiah)హత్యతో మొదలై నరసరావుపేట(Narasaraopet)నియోజకవర్గంలో వెన్నా బాలకోటిరెడ్డి (Balakotireddy)హత్య వరకు అనేక ఉదంతాలు దీనికి ఊతమిస్తున్నాయి.
రాజకీయ ఆధిపత్యం కోసమే..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీకి అధికార వైసీపీకి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది ఏ జిల్లా అయినా..మరే నియోజకవర్గమైన చిన్న గొడవతో మొదలై రక్తం ఏరులై పారేంతగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇదేంఖర్మ రాష్ట్రానికి" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. అయితే పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు తలపెట్టిన ఈ కార్యక్రమం ఉధ్రిక్తత పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతల అత్యుత్సాహమే దీనంతటికి కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మాచర్లలో నిర్వహించిన ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం కారణంగా మాచర్లలో వైసీపీ, టీడీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగినట్లైంది.
యుద్ధ వాతావరణం..
మూడ్రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం మిరియాల గ్రామంలో పర్యటించిన మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డికి ఆ గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తర్వాత ట్రాక్టర్ మీద ఎక్కించి ఊరంతా ఘనంగా ఊరేగించడం జరిగింది. ఐతే కార్యక్రమం ముగిసిన అనంతరం బ్రహ్మానందరెడ్డి ని ఊరేగించిన ట్రాక్టర్‌ని తగలబెట్టడం మిరియాల గ్రామంలో సంచలనం రేకెత్తించింది. ఇది వైసీపీ వాళ్ల పనేనంటున్నారు టీడీపీ శ్రేణులు.
టీడీపీ నేతల ఆరోపణలు..
బి.సి సామాజికవర్గానికి చెందిన చెందిన బత్తుల ఆవులయ్య ట్రాక్టర్‌ని తగలబెట్టడం దుర్మార్గమైన చర్యగా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు టీడీపీ వెంట నడుస్తున్నాయనే అక్కసుతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో రాజకీయ వైషమ్యాలను అరికట్టాల్సిన పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గొడవలకు బాధ్యులైన వారిపై ఖఠిన చర్యలు తీసుకుని పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకోల్పడానికి కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, AP Politics, Palnadu, TDP, Ycp