ONION PRICE HIKE IN ANDHRA PRADESH DAILY RATES ARE INCREASED PRESENT KG PRICE MORE THAN 50RS NGS
Onion Price: అమ్మో ఘాటెక్కిన ఉల్లి.. కట్ చేయకుండానే కన్నీరు.. వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే..?
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
Onion Price hike:అమ్మో ఉల్లి కొండెక్కి కూర్చుందని సామన్యుడు కన్నీరు పెట్టాల్సి వస్తోంది. అది కూడా కట్ చేకుండానే కన్నీరు పెట్టిస్తోంది. గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే నిత్యం రేటు పెరుగుతూనే వస్తోంది. ఇప్పటికు అన్ని ధరలు పెరగడంతో సామాన్యుడు నడ్డి విరుగుతోంది. ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది.
Onion Price in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఉల్లిపాయ ధరలు(Onion Price)ఆకాశాన్ని అంటే దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ధర చూస్తే అసలు భవిష్యత్తులో ఉల్లి కొనగలమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయ లేని వంటింటిని ఊహించలేం.... మార్కెట్లో ఉల్లిధర కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజురోజుకూ ధర పెరుగుతుండటంతో సామాన్యులు ఆచితూచి ఉల్లిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. వారం రోజుల వ్యవధిలో కిలోకు 10 రూపాయలపైనే ధర పెరగడంతో ఇంటి బడ్జెట్ (Home Budget)పెరిగిపోతోంది. కర్నూలు (Kurnool)లో పంట దిగుబడులు తగ్గిపోవడం, కర్ణాటక (Karnataka), రాజస్థాన్ (Rajasthan)లో వర్షాలకు పంట దెబ్బతినడం (Crop loss)తో ఈ పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలో పంటకు తెగుళ్లు రావడంతో ఆశించిన దిగుబడులు లేకపోవడం కూడా కారణమైంది. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మర్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సాధారణంగా రైతు బజారుల్లో, గ్రామాల్లో కిలో 15 నుంచి 20లోపు ధర ఉండాలి.. కానీ ప్రస్తుతం అక్కడే ఉండే ఉల్లి నాణ్యమైనవి కిలో 50లకు పెరిగింది. ఇక బహిరంగ మార్కెట్లో మరో పది ఇరవై ఎక్కువకే అమ్ముతున్నారు. ఉల్లిపాయల ఉత్పత్తికి ప్రధాన రాష్ట్రమైన మహారాష్ట్ర (Maharastra) ప్రధాన మార్కెట్లలో టోకున కిలో ధర 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. అక్కడి నుంచి రవాణా, ఇతర ఖర్చులు కలిపి కిలోకు 9 రూపాయల వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా నాణ్యమైన ఉల్లిపాయలు టోకున 45 రూపాయల నుంచి 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. రిటైల్‌లో 55 వరకు వసూలుచేస్తున్నారు. రెండో గ్రేడు ఉల్లిపాయలు కిలో 35 రూపాయల నుంచి 40వరకు అమ్ముతున్నారు. నాణ్యతను బట్టి ధర పలుకుతోంది. కృష్ణాశ్రమం రైతుబజారులో కిలో ఉల్లిపాయలు ధర 40 రూపాయలకు అమ్ముతున్నారు.
ఉల్లిపాయలు సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మన రాష్ట్రంలోని కర్నూలు తోపాటు కర్ణాటక నుంచి స్థానిక మార్కెట్‌కు వస్తాయి. నవంబరు నుంచి ఆగస్టు వరకు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. సగటున మూడు నెలలు మినహా ఏడాదిలో మిగిలిన కాలమంతా రాష్ట్రానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. కర్ణాటక రాష్ట్రంలో వర్షాల వల్ల ఉల్లిపంట ఆశించిన స్థాయిలో రాలేదు.
దిగుబడులపై తెగుళ్లు ప్రభావం కర్నూలు జిల్లా నుంచి వినాయకచవితి నాటికి మార్కెట్‌కు ఉల్లి వస్తుంది. ఈసారి తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గాయి. మహారాష్ట్రలోని నాసిక్, సంగంనేరు, చింతలగావ్, పూనే, ముంబయివాసి, కొల్హాపూర్, అహమ్మద్‌నగర్, శిర్డీ, షోలాపూర్ తదితర మార్కెట్ల నుంచి ఉల్లి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంది. షోలాపూర్ మార్కెట్‌కు నెలాఖరుకు కొత్త ఉల్లిపాయలు వస్తాయి. ప్రస్తుతం అహమ్మద్‌నగర్ మార్కెట్ నుంచి పాత ఉల్లి పాయలు దిగుమతి చేసుకుంటున్నారు.
పెరుగుదలకు ప్రధాన కారణం..
డిసెంబరు నెల నుంచి మనకు స్థానిక సరకు వస్తుంది. అన్ని వైపుల నుంచి ఉల్లిపాయలకు డిమాండ్ రావడం, అదే సమయంలో వరదలతో పంట దిగుబడులు తగ్గిపోవడంతో సరకు లభ్యత తగ్గి డిమాండ్ పెరిగింది. అక్టోబరు నెలాఖరుకు మహారాష్ట్ర మార్కెట్లకు కొత్త సరకు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, పకోడి వేసే వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన ధరకు కొంటున్నారు.
కర్నూలు ఉల్లితో సరి ఇక చిరువ్యాపారులు, సామాన్య వినియోగదారులు ఎక్కువగా కర్నూలు ఉల్లితో సరిపెట్టుకుంటున్నారు. దీంతో వ్యాపారులు కూడా కర్నూలు ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్ర ఉల్లి రోజుకు గుంటూరు నగరంలో 5 నుంచి 6 లారీలు విక్రయించేవారు. ధరలు పెరగడంతో రోజువారీ అమ్మకాలు 3 నుంచి 4 లారీల సరకుకే చాలా భారమవుతోంది అంటున్నారు. మహారాష్ట్ర మార్కెట్లలో కొనుగోలు తర్వాత ఖర్చులు కలపడం, బరువు తగ్గడంతో కలిపి ఇక్కడికొచ్చేసరికి కిలోకు 9 రూపాయల వరకు ధర పెరుగుతోందని టోకు వ్యాపారులు చెబుతున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.