జగన్ కేబినెట్‌లో ‘తొలి మంత్రి’ గెలిచినట్టేనా?

కొత్తపట్నం మండలంలో వైసీపీ, ఒంగోలు రూరల్ లో టీడీపీకి ఆధిపత్యం రావడం ఖాయమని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఒంగోలు టౌన్ లో ఎవరికి ప్రజలు మద్దతు పలికితే వారికే ఒంగోలు ఎమ్మెల్యే గా విజయం సాధ్యం.

news18-telugu
Updated: May 16, 2019, 4:03 PM IST
జగన్ కేబినెట్‌లో ‘తొలి మంత్రి’ గెలిచినట్టేనా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఢీ అంటే ఢీ అంటూ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ (డీజే), వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి (బీఎస్) పోటీపడ్డారు. ఇద్దరూ వైసీపీ, టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కావడంతో రెండు పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటు దక్కించుకోవడానికి దామచర్ల, నాలుగోసారి ఒంగోలు నుంచి గెలవాలని బాలినేని సర్వశక్తులూ ఒడ్డటంతో ఎన్నికల ఖర్చు సుమారు 100 కోట్లు దాటినట్టు అంచనా. పోలింగ్ జరిగే వారం రోజుల ముందు వరకూ కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్న టీడీపీ.. చివరి 3 రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో డిఫెన్స్ లో పడింది. పోలింగ్ కి 24గంటల ముందు ప్రకాశం జిల్లా ఎస్పీని, ఈసీ విధుల నుంచి తప్పించడంతో పాటు.. ఒంగోలుకు వచ్చే కావేరీ ట్రావెల్స్ బస్సులను తెలంగాణలో నిలిపివేశారు. వీటిలో అత్యధిక బస్సులు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే ఓటర్లను తరలించడానికి ఏర్పాటు చేసినవే అనే వాదన ఉంది. దీంతోపాటు... టీడీపీ అభ్యర్థి దామచర్లకు ఎన్నికలకు డబ్బులు సర్దుబాటు చేసుకునే అన్ని దారులను.. రాజకీయ వ్యూహంతో వైసీపీ అడ్డుకుంది. దీంతో ‘కచ్చితంగా గెలుస్తాము’ అనే పరిస్థితి నుంచి టీడీపీ ‘ఒంగోలులో గెలుస్తాము’ అనే పరిస్థితికి వచ్చింది.

బాలినేని శ్రీనివాసరెడ్డి (File)


మరోవైపు.. మొదటి నుంచి విజయంపై అంత ధీమాగా లేని వైసీపీ అభ్యర్థి బాలినేని.. టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరడం, పోల్ మేనేజ్ మెంట్, టీడీపీ నేతలను తనవైపు తిప్పుకోవడంతో విజయంపై ధీమాగా ఉన్నారు. పోలింగ్ కి వారం రోజుల ముందు నుంచే ఓటర్లకు డబ్బులు చేరవేయడంతో పాటు... టీడీపీ అభ్యర్థికంటే అధికంగా ఓటర్లను ‘ఆకర్షించడం’లో బాలినేని విజయం సాధించారు. గతంలో పట్టుకోల్పోయిన కొత్తపట్నం మండలంలోనూ పరిస్థితిని మెరుగు పరుచుకున్నారు.

జనసేన కొంపముంచుతుందా?
టీడీపీ, వైసీపీ నాయకులు ఎన్ని చెప్తున్నా.. వారి గుండెల్లో జనసేన గుబులు పుట్టిస్తోంది. ఒంగోలు టౌన్ లోనే సుమారు 28,000 మంది కాపు ఓటర్లు ఉండటమ దీనికి ప్రధాన కారణం. దీనికితోడు.. 2009 ఎన్నికల్లో పీఅర్పీ పార్టీ అభ్యర్థికి 33,716 ఓట్లు పోలయ్యాయి. 2019లో పవన్ కల్యాణ్ జనసేన తరఫున ముస్లిం సామాజికవర్గానికి చెందిన షేక్ రియాజ్ బరిలో ఉన్నారు. ప్రధానంగా కాపులు, ముస్లింలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఓట్లు చీలి జనసేనకు పోలయితే వైసీపీకి మైనస్ గా మారుతుందనేది టీడీపీ భరోసాగా ఉండగా.. 2014 ఎన్నికల్లో జనసేనతో పొత్తువల్ల కాపులు ఓట్లు టీడీపీకి రావడంతోనే గెలిచారని.. ఇప్పుడు జనసేన వల్ల టీడీపీకే నష్టమని వైసీపీ నమ్మకంగా ఉంది.

Pawan Kalyan interesting comparison between PRP and Janasena
పవన్ కళ్యాణ్ (File)


పెరిగిన 5.40 % పోలింగ్ ఎవరికి అనుకూలం?ఒంగోలు అసెంబ్లీ స్థానంలో 2,29,312 ఓట్లు ఉండగా... 1,92,518 ఓట్లు పోలయ్యాయి. దీంతో 2014 ఎన్నికల్లో 77.58 % పోలింగ్ నమోదు కాగా, ఈ సారి అధికంగా 82.90 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం వరకూ 35% ఉన్న పోలింగ్ శాతం.. ఒక్కసారిగా పెరిగి పోలింగ్ ముగిసే సమయానికి 82.90 నమోదైంది. మహిళలు అధికంగా పోలింగ్ లో పాల్గొన్నారు. దీంతో వీరు ఎవరికి ఓటు వేస్తే వారిదే విజయం అని టీడీపీ, వైసీపీ ఫిక్స్ అయ్యాయి.

ప్రతీకాత్మక చిత్రం


ఒంగోలు నగరమే కీలకం..!
ఒంగోలు నగరంలో మొత్తం ఓట్లు 1,67,891 ఓట్లు ఉన్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ లో 1,37,952 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో టీడీపీకి 9596 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఈ మెజార్టీ నిలబెట్టుకుంటామని టీడీపీ అభ్యర్థి దామచర్ల నమ్మకంతో ఉన్నారు. వైసీపీకి మద్దతుగా ఉండే ఇస్లాంపేట, క్లౌపేటలో తమకు ఈసారి ఓట్లు పోలయ్యాయని.. నగరంలో సుమారు 16 వేలు ఉన్న వైశ్య సామాజికవర్గం ఓట్లు కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు ప్రభావంతో ఏకపక్షంగా టీడీపీ పోలయ్యాయని టీడీపీ నమ్మకంతో ఉంది. వైసీపీ నేతలు మాత్రం జనసేన పొత్తువల్లే నగరంలోని కాపులు ఓట్లు 2014 ఎన్నికల్లో టీడీపీకి వచ్చాయని.. కాపుల అధికంగా ఉండే గద్దల గుంటలో జనసేనకు ఓట్లు పోలయ్యాయని.. ఇది టీడీపీకి మైనస్ అంటోంది.

ap assembly elections 2019, tdp campaign,ysrcp campaign, public pulse,ys jagan, chandrababu naidu, ongole ,ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019, వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు, ఒంగోలు
ప్రతీకాత్మక చిత్రం


ఒంగోలు గ్రామీణం, కొత్తపట్నం మండలాలే కీలకం..!
మొదటి నుంచి ఒంగోలు గ్రామీణం టీడీపీకి, కొత్తపట్నం మండలం వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో రెండు మండలాల్లోనూ టీడీపీనే ఆధిపత్యం సాధించి విజయం సాధించింది. దీంతో వైసీపీ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ నుంచి వైసీపీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేరికతో ఆయన ప్రభావం కొత్తపట్నం మండలంలో వైసీపీకి కలసి వచ్చింది. దీంతో ఈసారి కొత్తపట్నం మండలంలో 5,000 ఓట్ల మెజార్టీ వస్తోందని వైసీపీ భావిస్తుంటే.. వైసీపీకి అక్కడ కేవలం 1000 ఓట్ల మెజార్టీ మాత్రమే వస్తుందని టీడీపీ వాదన. అదేవిధంగా ఒంగోలు రూరల్ మండలంలోనూ టీడీపీ మెజార్టీ తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. 2014లో టీడీపీ ఒంగోలు రూరల్ 3,412 ఓట్ల ఆధిక్యం రాగా.. ఇప్పుడు అక్కడ 2,500 ఓట్ల ఆధిక్యం వస్తోందని టీడీపీ భావిస్తుంటే... 1000 మాత్రమే ఆధిక్యం ఉంటుందని వైసీపీ వాదన.

ఓటర్ తీర్పు ఎవరికి అనుకూలం..?
ఎవరి వాదన ఎలా ఉన్నా కొత్తపట్నం మండలంలో వైసీపీ, ఒంగోలు రూరల్ లో టీడీపీకి ఆధిపత్యం రావడం ఖాయమని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఈ రెండు మండలాల్లోనూ ఓట్ల ఆధిపత్యం కేవలం బలాన్ని నిరూపిస్తుందే గానీ, విజయాన్ని ఇవ్వదు. ఒంగోలు టౌన్ లో ఎవరికి ప్రజలు మద్దతు పలికితే వారికే ఒంగోలు ఎమ్మెల్యే గా విజయం సాధ్యం. చూడాలి ఓటర్ తీర్పు ఎలా ఉందో...?

(డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: May 16, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading