ONGOLE DISTRICT COURT ORDERED HANG TILL DEATH TO HIGHWAY KILLER MUNNA AND 11 MEMBERS IN GANG AK
Andhra Pradesh: మున్నా గ్యాంగ్‌లో 12 మందికి ఉరి శిక్ష.. ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పు.. అసలు వీళ్లు ఏం చేశారంటే..
గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మున్నా
13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితులు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్య చేశారని తేలడంతో.. ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరి శిక్ష విధించింది.
హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. 13 ఏళ్ల క్రితం హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను మున్నా గ్యాంగ్ హత్య చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితులు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్య చేశారని తేలడంతో.. ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరి శిక్ష విధించింది. వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపి గోతాల్లో కుక్కి వాగుల వద్ద హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ పూడ్చిపెట్టిన ఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. 2008లో ఈ దారుణాలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు. సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా కోసం గాలింపు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు.
మున్నా గ్యాంగ్‌ను విచారించిన క్రమంలో అనేక దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మున్నా గ్యాంగ్ పోలీసు దుస్తులు వేసుకుని హైవేపై వచ్చీపోయే వాహనాలను ఆపేవారని విచారణలో వెల్లడైంది. గ్యాంగ్ సభ్యులు చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగించి అతి కిరాతకంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేశారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు. మరో ఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుప లోడును తీసుకెళుతుండగా.. తెట్టువద్ద ఆపి డ్రైవర్ భూషణ్‌యాదవ్, క్లీనర్ చందన్ కుమార్ మెహతోలను చంపి శవాలను మన్నేరు వాగు వద్ద పూడ్చిపెట్టారు.
తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడకు ఇనుప యాంగ్యులర్‌లతో బయల్దేరిన లారీని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరి శ్యాంబాబు, గుత్తుల వినోద్‌కుమార్‌లను దారుణంగా హత్యచేసి శవాలను నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చిపెట్టారు. నాగాలాండ్‌కు చెందిన లారీని కూడా ఇదేవిధంగా ఆపి డ్రైవర్‌ను హతమార్చి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలోని గుండ్లకమ్మ ఒడ్డున చిల్లచెట్లలో పూడ్చిపెట్టారు. మాయమైన లారీలు మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద లీజుకు తీసుకున్న టుబాకోస్ వెనుక గోడౌన్లో ముక్కలు చేసినట్టు గుర్తించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.