కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఓఎన్జీసీ ఏపీలో తన కార్యకలాపాలను నిలిపేయనుందా ? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద తీసుకున్న 70 ఎకరాల స్ధలంలో కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం విధించిన ఫైన్ చెల్లించేందుకు సిద్ధమైనా ఏపీఐఐసీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించడం లేదని తెలుస్తోంది. దీంతో ఏపీలో తన కార్యకలాపాలను ఆపేయాలని ఓఎన్జీసీ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇప్పటికే పలు పరిశ్రమల తరలింపు వార్తలతో తలెత్తిన అనిశ్చితి పతాక స్ధాయికి చేరనుంది.
ఒకప్పుడు చమురు, గ్యాస్‌ల అన్వేషణ, వెలికితీత, విక్రయాల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన ఒఎన్‌జీసీ చమురు అన్వేషణ రంగాన్ని ప్రైవేటీకరించినతర్వాత కూడా తన గుర్తింపును కొనసాగిస్తోంది. తూర్పు తీరం వెంబడి బంగాళాఖాతంలోని గోదావరి-కృష్ణ బేసిన్ పరిధిలో ప్రైవేటు సంస్థల్తో పోటీపడి మరీ తన కార్యకలాపాల్ని ఓఎన్జీసీ విస్తరించింది. మొత్తం 71 బావుల్ని తవ్వి చమురు, గ్యాస్‌ల అన్వేషణ కొనసాగిస్తోంది. ఒకప్పుడు చెన్నై కేంద్రంగా ఉన్న ఓఎన్జీసీ కేజి బేసిన్ కేంద్ర కార్యాలయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజమండ్రికి మార్పించారు. కృష్ణా-గోదావరి బేసిన్‌లోని సముద్ర భూగర్భంతో పాటు తీరప్రాంతంలో కూడా అన్వేషణలు సాగించిన ఓఎన్‌జీసీ ప్రస్తుత పాలకుల నుంచి సహకారం కరవై ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
1983నుంచి కేజీ బేసిన్ పరిధిలోని రాజోలు, రాజమండ్రి, నర్సాపురం ప్రాంతాల్లో ఒఎన్‌జిసి తన కార్యకలాపాల్ని విస్తరించింది..2009లో 10ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల పరిధిలోని గ్యాస్ నిక్షేపాల్ని గుర్తించి తవ్వితీయడం మొదలెట్టింది. ఈ ప్రాంతంలోని 50వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తవ్వకాల్ని విస్తరించింది. ఇక్కడ మరో రూ. 40వేల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తోంది. అలాంటి ఓఎన్జీసీ కార్యకలాపాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ వెలికితీసే గ్యాస్, చమురు నిక్షేపాల్ని స్థానికంగా వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డొస్తున్నాయి.
ఓఎన్జీసీ వెలికితీస్తున్న గ్యాస్, చమురు నిక్షేపాల్ని పైప్‌లైన్ల ద్వారా ముంబయికి తరలిస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన సరఫరా నిబంధనలకనుగుణంగా అక్కడ్నుంచి పరిశ్రమలకు అందిస్తున్నారు. స్థానికంగా లభ్యమౌతున్న గ్యాస్, చమురులను ముందుగా స్థానిక పారిశ్రామిక అవసరాలకు కేటాయించాలన్న డిమాండ్‌ను గతంలో ప్రభుత్వం కేంద్రం ముందుంచింది. అయితే ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ డిమాండ్ సాధన కోసం ప్రభుత్వంతో పాటు పలు ప్రజాపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఓఎన్జీసీ కార్యకలాపాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది.
ఈ దశలో కాకినాడలో ఏపీఐఐసీ ద్వారా ఓఎన్జీసీ 70ఎకరాల భూముల్ని కొనుగోలు చేసింది. కోట్ల వ్యయంతో ఈ భూమిని చదును చేసింది. చుట్టూ ప్రహరీ నిర్మించి లోపల భవనాలు కట్టి ఇందులో ఒఎన్‌జీసీ విస్తరణలో భాగంగా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే ఈ 70 ఎకరాల భూముల కేటాయింపు సందర్భంలో నిర్ణీత సమయంలోగా పారిశ్రామిక కార్యకలాపాలు అమల్లోకి రావాలన్న నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ పనులు సాగలేదు. దీన్ని సాకుగా చూపి ఏపీఐఐసీ రూ. 20కోట్ల అపరాద రుసుం విధించింది. ఇందులో రూ. 15కోట్లు ఇప్పటికిప్పుడు చెల్లించేందుకు ఒఎన్‌జీసీ ముందుకొచ్చింది.
మరో రూ.5 కోట్ల చెల్లింపునకు వాయిదాలు కావాలంటూ ఏపీఐఐసీని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, ఒఎన్‌జీసీల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో అపరాద రుసుంలోని ఐదుకోట్ల చెల్లింపునకు వాయిదాల అనుమతిపై ఏపీఐఐసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చించేందుకు ఏపీఐఐసీ ఉన్నతాధికార్లు ముఖ్యమంత్రిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారెవరికీ ముఖ్యమంత్రి నుంచి కనీసం అపాయింట్‌మెంట్ కూడా లభించలేదు.
ఇప్పటికే కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ తరపున ఆయిల్ రిగ్‌లు నిర్వహిస్తున్న నాబోర్స్ అనే సంస్థ ఇక్కడ పనులు చేయలేమంటూ చేతులెత్తేసింది. ఇందుకు కారణం వారి భారీ వాహనాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డంపడుతున్నారు. ఏపీఐఐసీ కార్యకలాపాల ద్వారా తమకొరిగే ప్రయోజనాలేంటంటూ నిలదీస్తున్నారు. ఈ బాధలు పడలేక నాబోర్స్ ఇక్కడ్నుంచి తన కార్యకలాపాల్ని ఆపేసింది. కాగా ఇప్పుడు ఏపీఐఐసీ కూడా తన అన్వేషణ, వెలికితీత, విక్రయ కార్యకలాపాల్ని ఆపేయాలని భావిస్తోంది. దీంతో ఇక రూ. 40వేల కోట్లతో ప్రతిపాదించిన విస్తరణ కూడా అటకెక్కనుంది.
కేవలం నిర్దేశిత సమయంలోగా పారిశ్రామిక కార్యకలాపాలు అమలు చేయడం లేదన్న ఏపీఐఐసీ నిబంధనకనుగుణంగా విధించిన అపరాద రుసుంలో ఐదుకోట్ల చెల్లింపు కోసం కోరిన వాయిదాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒఎన్‌జిసి వంటి అతిపెద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఒకప్పుడు ఒఎన్‌జిసి రాకకోసం రాష్ట్రాలన్నీ ఎదురుచూసేవి. ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తే ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పారిశ్రామిక వృద్ధి జరిగేది. అనుబంధ కుటీర పరిశ్రమలు వేలసంఖ్యలో వెలిసేవి. వాటిలో లక్షలాదిమందికి ఉపాధి లభించేది. హోటల్, రవాణా రంగాలకు ప్రోత్సాహముండేది. కేవలం మన రాష్ట్రానికి వెలికితీసిన గ్యాస్, చమురుల్లో ప్రధమ వినియోగానికి అనుగుణంగా అవకాశాల్లేవన్న ఒకే ఒక కారణంతో మొత్తం ఒఎన్‌జిసి కార్యకలాపాల పట్ల ప్రభుత్వం సీతకన్నేయడం ఒఎన్‌జిసి ఇక్కడ్నుంచి తరలిపోయే పరిస్థితి తీసుకురావడం విమర్శలపాలవుతోంది.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.