హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam Gangavaram port: గంగవరం ఇక ఆదానీ పరం : 58.1 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం

Visakhapatnam Gangavaram port: గంగవరం ఇక ఆదానీ పరం : 58.1 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం

గంగవరం ఆదానీ పరం

గంగవరం ఆదానీ పరం

దేశంలోనే అతి పెద్ద పోర్టుల్లో ఒకటైన గంగవరం.. ఇక ఆదానీ పరమైంది. దీంతో దేశ వ్యాప్తంగా అధానీ సంస్థ తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది.

ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరం అదానీ పరమవుతోంది. భారత్ లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించేదిశగా అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు అదానీ గ్రూపు అధికారికంగా ప్రకటించింది. డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా కొనుగోలు కోసం 3 వేల 604 కోట్ల ఒప్పందం కుదిరనట్లు పేర్కొంది. ఈ పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాను 1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వాటా 89.6 శాతానికి చేరనుంది.

విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్‌-మేజర్‌ పోర్టుగా గుర్తింపు పొందింది. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఈ పోర్టుకు ఉంది. బాగా లోతైన పోర్టు అవ్వడంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్‌ కేప్‌ సైజ్‌ ఓడలూ వచ్చి వెళ్లగలవు. దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది.

గంగవరం పోర్టు కంపెనీ మొత్తం మూలధనం 51.70 కోట్ల షేర్లు. ఇందులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాటా 10.4 శాతం కాగా, వార్‌బర్గ్‌ పింకస్‌ చేతిలో 31.5 శాతం వాటా ఉంది. వార్‌బర్గ్‌ పింకస్‌, డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబ వాటానే తాజాగా అదానీ గ్రూపు కొనుగోలు చేస్తోంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో 89.6 శాతం వాటా అదానీ పరమైంది. తాజా ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సముద్రతీరంలో అదానీ పోర్ట్స్‌ అత్యంత మెగా సంస్థగా ఆవిర్భవించినట్లు అవుతుంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును కొంతకాలం క్రితం అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సొంతం చేసుకుంది.

తీరంలో పోర్టులను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్న అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలోని మరో పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని 12 వేల కోట్లతో కొనుగోలు చేసింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టుల కొనుగోలుతో ఏపీ సముద్ర తీరంపై అదానీ పోర్ట్స్‌ ఆధిపత్యం సాధించినట్టయింది. గత నెలలో మహారాష్ట్రలోని డిఘి పోర్టును కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ ఇప్పుడు గంగవరం కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పోర్ట్‌ అండ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ నిర్మాణంలో భాగంగా గంగవరం పోర్టు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా అదానీ గ్రూప్‌దే. అదానీల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ పోర్టు ఉంది. 2006లో పది మిలియన్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఒక పోర్టుకు అధిపతిగా ఉన్న అదానీ ఇప్పుడు 498 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 12 పోర్టుల అధిపతిగా అవతరించారు.

దేశీయంగానే కాదు..పొరుగు దేశాల్లోనూ పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవలే శ్రీలంక ప్రభుత్వంతోనూ అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. కొలంబో పోర్టుకు సంబంధించి వెస్ట్ కంటెయినర్‌ టెర్మినల్‌ను నిర్మించి, 35 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీలంక పోర్టు అధారిటీతో తాజాగా అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు