Home /News /andhra-pradesh /

NO NEW MYSTERY DISEASE CASES REGISTERED IN ELURU PRN

Mystery Disease: ఏలూరుకు ముప్పు తప్పినట్టేనా..? మరి మిస్టరీ వీడేదెప్పుడో..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతానికి కొత్త కేసులు నమోదు కాకపోయినా.. భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  వింత వ్యాధితో వణికిపోయిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం క్రమంగా కోలుకుంటోంది. రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరవ్యాప్తంగా మొత్తం 650 మంది అస్వస్థతకు గురవగా.. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారందరినీ డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిని వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరీక్షిస్తోంది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే జనం అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో ఆరోగ్య సర్వేను పూర్తి చేశారు. వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీర్ల ద్వారా నిత్యం ఏలూరు వాసులపై పర్యవేక్షణ ఉంచుతున్నారు. పలు ప్రాంతాల్లో తాత్కాలిక వైద్య శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి.

  అండగా ప్రభుత్వం
  మరోవైపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించింది. మంచినీళ్లు తాగేందుకు కూడా ప్రజలు భయపడుతున్నందున వారి కోసం ప్రత్యేకంగా ఆర్వో వాటర్ సరఫరా చేస్తోంది. ఇక వలంటీర్ల ద్వారా నిత్యావసరాలను కూడా ఇంటింటికీ పంపిణీ చేశారు. ఎలాంటి సమస్య ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి రావాలని వైద్య శాఖ అధికారులు స్థానికులకు సూచించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని బృందం నిత్యం బాధితులకు అందుబాటులో ఉంటూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితులకు భరోసానిస్తూ సకాలంలో వైద్యసేవలందించడంలో కీలకపాత్ర పోషించారు.

  ఇంకా వీడని మిస్టరీ..
  వింత వ్యాధి అదుపులోకి వచ్చినా..వ్యాధి ఎందుకొచ్చింది అనేదానిపై మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్, హైదరాబాద్ లోని NIN, సీసీఎంబీ, WHO లాంటి సంస్థలు శాంపిల్స్ ను పరీక్షిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో నీరు, పాలు, కూరగాయలు, ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన నిపుణులు వాటిని ల్యాబ్ ల్లో పరీక్షిస్తున్నారు. అలాగే బాధితుల బ్లడ్ శాంపిల్స్ పైనా పరిశోధన జరుగుతోంది. రక్త నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. అలాగే నీటిలో ప్రమాదకర స్థాయిలో రసాయనాలున్నట్లు వెల్లడైంది. ఇప్పటికే ఆయా సంస్థల నిపుణులతో సీఎం వైఎస్ జగన్ రెండుసార్లు సమావేశమై చర్చించారు.

  గండం గడిచినట్లేనా..?
  కొత్త కేసులు నమోదు కాకపోవడంతో గండం గడిచినట్లు కాదని నిపుణులు చెప్తున్నారు. సహజ వనరులు కలుషితం కావడం వల్లే ఇలా జరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. పంటలు, నీటి శుద్ధిలో రసాయనాల వినియోగం తగ్గిస్తే ఇలాంటి సమస్యలు రావని సూచిస్తున్నారు. అస్వస్థతకు కచ్చితంగా ఇదీ కారణం అని బయటపడకపోయినా సాగు,త్రాగునీటితో పాటు కల్తీ ఆహారం ప్రజల ప్రాణాల మీదకి తెస్తుందని ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. ముఖ్యంగా క్యాన్సర్ కారకాలు బయటపడటం, భూగర్భ జలాల్లో కూడా ఈ-కొలి బ్యాక్టీరియా అనవాళ్లుండటం ఆందోళన కలిగిస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Eluru

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు