కరోనా మహమ్మారి 2020ని మర్చిపోకుండా చేసింది. అనేక మంది ఈ ఏడాది తమ ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆ సమయంలో జరగాల్సి ఉన్న వివాహాలను వాయిదా వేసుకున్నారు. దీంతో చాలా మంది తాము చేసుకున్న ఏర్పాట్లు వృథా కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. అన్ లాక్ అనంతరం ప్రభుత్వం వివాహాలకు అనుమతిచ్చింది. మొదట కొద్ది మంది సమక్షంలోనే జరిగిన వేడుకలు.. ఇప్పుడు గతంలో మాదిరిగానే వందలాది మంది అతిథుల నడుమ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ చివరిలో మంచి ముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాలో వేలాదిగా వివాహాలు జరిగాయి.
అయితే త్వరలోనే మళ్లీ వివాహ వేడుకలకు నెలల పాటు బ్రేక్ పడనుంది. ప్రస్తుతం జనవరి 7 వరకే ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. తర్వాత మళ్లీ ముహూర్తాలు లేవంటున్నారు. మూఢాల అనంతరం 2021 మే 16 నుంచే మళ్లీ మంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయని వారు వివరిస్తున్నారు. దీంతో త్వరలో పెళ్లీలు చేసుకోవాలనుకుంటున్న వారు, గతంలో కరోనా, ఇతర కారణాలతో వాయిదా వేసుకున్న వారు మళ్లీ నెలల పాటు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే.. వివాహాల లాంటి వేడుకలపై ఆధారపడి అనేక మంది జీవిస్తుంటారు. ఫంక్షన్ హాళ్ల సిబ్బందితో పాటు, పని మనుషులు, వంట మనుషులు, లైటింగ్, టెంట్ హౌస్, డెకరేషన్, ఫొటో గ్రాఫర్లు, డీజే, ట్రావెల్స్, సౌండ్ సిట్టమ్, ఇలా లక్షలాది మంది ఈ శుభకార్యాల ద్వారా ఉపాధి పొందుతుంటారు. ఇప్పుడు మరో ఐదు నెలల పాటు వివాహాలకు ముహూర్తాలు లేక పోవడంతో లాక్ డౌన్ సమయంలోనే నెలల పాటు వివాహాలు జరగక తీవ్రంగా నష్టపోయిన అనేక మంది మరో సారి నెలల పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
Published by:Nikhil Kumar S
First published:January 01, 2021, 08:34 IST