No Cabinet berth: రేపో, ఎల్లుండో కేంద్ర కేబినెట్ భేటీ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆ ఫైల్ పై ప్రధాని మోదీ సంతకం కూడా చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా.. తాజా పరిణామాలు చూస్తుంటే.. కేబినెట్ పునర్వ్యవస్తీకరణకు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. రేపు లేదా ఎల్లుండే భారీ విస్తరణ జరగనున్నట్టు సమాచారం.. నరేంద్ర మోదీ కేబినెట్లో దాదాపు 25 మంది కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులతో సమావేశమై చర్చించారు.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్‌లకు కొత్త మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సారి మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరిగింది. తెలంగాణ నుంచి ఎంపీలు నేరుగా ఎన్నికైన నేపథ్యంలో మరో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతుండగా.. సోయం బాబురావుకు కేబినెట్ లో చోటు కల్పిస్తున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక ఏపీ విషయానికి వస్తే కచ్చితంగ ఒక మంత్రి పదవి వస్తుందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జీవీఎల్ లేదా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ల్లో ఒకరికి అవకాశం వస్తుందంటూ వార్తలు వినిపించాయి. లేదంటే బీజేపీ మిత్ర పక్షంగా పవన్ కు అవకాశం ఇస్తున్నారని లీకులు కూడా ఇచ్చారు. అయితే ఆ వార్తలను జనసేన ఖండించింది. తాము ఎలాంటి పదవులు ఆశించడం లేదని బహిరంగంగానే చెప్పింది. ఇతర ఎంపీల విషయానికి చివరి నిమిషం వరకు మంత్రి పదవి కోసం ఢిల్లీలో లాభియింగ్ చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపైనే మోదీ, అమిత్ షా టీం ఫోకస్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ సారి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఈ దఫా కూడా తెలుగు నేలకు చెందిన నేతలకు చోటు దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
తాజగా గవర్నర్ల నియామకంతో దానిపై క్లారిటీ వచ్చేసింది. కేంద్ర కేబినెట్ లో చోటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. రాష్ట్ర ప్రజలతో పాటు బీజేపీ కేడర్, నేతల్లో వ్యతిరేకత రాకుండా చూసేందుకు గవర్నర్ గిరీతో సరిపెట్టినట్టు సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్న వేళ ఇప్పటికే గవర్నర్ గా తెలుగు నేలకు చెందిన బండారు దత్తాత్రేయ కొనసాగుతుండగా.. తాజాగా ఏపీ కోటాలో విశాఖపట్నం మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు కూడా కేంద్రం గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మిజోరం గవర్నర్ గా హరిబాబును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దత్తాత్రేయను హరియాణా గవర్నర్ గా మార్చింది.
ఇదీ చదవండి: కూలిన ఫ్లైఓవర్ పిల్లర్.. కారు, ట్యాంకర్ ధ్వంసం.. దంపతులు మృతి
కేంద్ర మంత్రివర్గం పునర్వవస్థీకరణకు కసరత్తులు పూర్తి చేసిన మోదీ.. ఉన్నట్టుంది మంగళవారం పలు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్ లను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో హరిబాబు, దత్తాత్రేయలతో పాటు బీజేపీకి చెందిన కీలక నేతలు థావర్ చంద్ గెహ్లాట్, రమేశ్ బైస్, రాజేంద్ర విశ్వనాథ్, మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, శ్రీధరన్ పిళ్లై, సత్యదేవ్ నారాయణ్‌లు ఉన్నారు. దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హరియాణాకు మార్చిన కేంద్రం.. హిమాచల్ కు రాజేంద్ర విశ్వనాథ్ ను నియమించింది.
ఇదీ చదవండి:సీఎం జగన్ పులివెందుల షెడ్యూల్ ఇదే.. పర్యటనలో మార్పులకు కారణం అదే..!
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న దత్తాత్రేయను కీలకమైన హరియాణాకు గవర్నర్ గా మార్పు చేశారు. గవర్నర్ ల జాబితాలోకి కొత్తగా చేరిన హరిబాబును చిన్న రాష్ట్రం అయిన మిజోరంకు కేటాయించారు. ఇలా కేంద్రమంత్రి వర్గం పునర్వవస్థీకరణకు రంగం సిద్ధమైన వేళ.. హరిబాబును కొత్తగా గవర్నర్ గిరీ కట్టబెట్టడం, దత్తాత్రేయను కీలక రాష్ట్రమైన హరియాణాకు మార్పు చేయడంతో ఇక కేంద్ర మంత్రివర్గంలో తెలుగు నేలకు చెందిన నేతలకు అవకాశం లేదన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది. కేంద్రంలో ఎప్పుడూ ఏపీకి చిన్న చూపు తప్పడం లేదు. మరోసారి కేబినెట్ బెర్త్ లో మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటే ఒప్పుకుంటారు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Central cabinet, Pm modi, Telangana