విశాఖపై మరోసారి చిన్నచూపు.. పప్పు బెల్లాలతో కొసరు వడ్డించిన కేంద్రం

విశాఖపై మరోసారి చిన్నచూపు.. పప్పు బెల్లాలతో కొసరు వడ్డించిన కేంద్రం

కిరండూల్ ఎక్స్ ప్రెస్

ఏపీపై కేంద్రం చిన్న చూపుచూస్తోందా..? అందుకే విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. తాజా బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు..

 • Share this:
  విశాఖ రైల్వే జోన్ ఊసు అటకెక్కిందా..? ఈ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టేసిందా..?  రెండేళ్ల కిందట విశాఖలో జోన్ పై స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రధాని మోదీ..? గతేడాది బడ్జెట్ లో కాస్త చిల్లర విదిల్చారు కూడా.. మరి ఈ ఏడాది బడ్జెట్ లో ఏం చెప్పారు.. పింక్ బుక్ లో రైల్వే జోన్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు..?

  విశాఖ రైల్వే జోన్ విషయంలో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి ఎదురైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటయ్యే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. తాజా బడ్జెట్‌లో దీని కోసం నిధులేమీ కేటాయించలేదు. బడ్జెట్ లో కనీసం విశాఖ జోన్‌ ప్రస్తావన కూడా చేయకపోవడంపై ఉత్తరాంద్ర ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. విశాఖకు రైల్వే జోన్ అన్నడిమాండ్ పుట్టి యాభై ఏళ్లు దాటింది. రెండు దశాబ్దాలుగా పోరాటం సాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత విశాఖ జోన్ వచ్చినట్టే అని అంతా సంబర పడ్డారు.. కానీ రాష్ట్ర్ర విభజన నాటి హామీ కాగితాలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం అదీ ఎన్నికలు ముందు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చి రైల్వే జోన్ ఇచ్చేశామని చెప్పారు. జనమంతా సంబరాలు చేసుకున్నారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు.. నిధులు విడుదల చేయడం లేదు. బడ్జెట్లు దాటుతున్నాయి తప్పా.. కేంద్రం నిధులు విదల్చడం లేదు.. కనీసం బడ్జెట్ లో ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. గత బడ్జెట్ లో రైల్వే జోన్ కి అంటూ ఒక రెండు కోట్లు నిధులు కేటాయించారు. ఈసారి అదీ లేకుండా పోయింది.

  దాదాపు నాలుగైదు వేల కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప విశాఖ రైల్వే జోన్ అన్నది గాడిలో పడదు. కనీసం రూపాయి అయినా విదల్చకుండా కేంద్రం చేస్తే విశాఖకు రైల్వే జోన్ ఎలా వస్తుందని ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ ఊసెత్తడం లేదు కాని.. విపక్షాలు.. ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అనే అంశాన్ని తెరపైకి తెస్తోంది కేంద్రం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విశాఖ రైల్వేజోన్ పూర్తిగా అటకెక్కినట్టే అని స్థానికులు నిట్టూరుస్తున్నారు. రైల్వే జోన్ కూత ఎప్పటికీ వినిపించదేమో అని నిరాశకు గురవుతున్నారు.

  కేంద్రం  తీరుపై ఆగ్రహంతో ఉన్న ఉత్తరాంధ్ర వాసులను కాస్త చల్లార్చ డానికి పప్పుబెల్లాలు ఇచ్చినట్టు చిన్న చిన్న తాయిలాలతో సరిపెట్టేసింది కేంద్రం. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని జాతీయ ప్రాధాన్యమున్న, అనుసంధాన అవసరాలున్న ప్రాజెక్టులకు కేటాయింపులు చేశారు. ప్రధానంగా నడికుడి - శ్రీకాళహస్తి లైను నిర్మాణానికి 1,144 కోట్ల రూపాయలు, విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను నిర్మాణానికి 800 కోట్ల రూపాయలు, కాజీపేట-విజయవాడ మూడో లైను విద్యుదీకరణకు 300 కోట్లు కేటాయించారు. జోన్లవారీ బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి రైల్వే శాఖ బుధవారం రాత్రి పింక్‌ బుక్‌ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 5,812 కోట్లు కేటాయించింది. 32 కొత్తలైన్లు, పాతవాటి డబ్లింగ్‌ పనులకు సంబంధించి ఈ నిధులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2009-14 మధ్య రాష్ట్రానికి 886 కోట్లు కేటాయించగా రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే 556శాతం అధిక నిధులు ఇచ్చినట్లు చెప్పింది.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు