తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ రాష్ట్రాలను వణికిస్తున్న నివర్ తుపాను ప్రభావం తిరుమలపై కూడా ఎక్కువగానే ఉంది. తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమలలోని జలాశయాలు నిండాయి. పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను అధికారులు ఎత్తారు. మరోవైపు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది.. జేసీబీ సాయంతో కొండచరియలను తొలగించారు. ప్రయాణికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. ఇక బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలడంతో రెండు బైక్‌లు ధ్వంసం అయ్యాయి.
ఏపీలో నివర్ తుపాను ప్రభావం ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఉంది. తుపాను కారణంగా నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావలిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు.
తీవ్రమైన నివర్ తుపాన్ నేపథ్యంలో రేణిగుంటలో బాలాజీ కాలనీ నీటమునిగింది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. దీంతో అరినియర్, మల్లెమడుగు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేత వేశారు. పలు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyclone Nivar, Tirumala Temple