news18-telugu
Updated: November 24, 2020, 6:31 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ వాయుగుండం తుపానుగా మారితే దీన్ని నివర్ తుపానుగా పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది క్రమేపీ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం (నవంబర్ 25) నాటికి కారైక్కాల్, మామల్లపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణలకు కూడా తుపాను ముప్పు పొంచి ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా, రేపు తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాయలసీమలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీ, తమిళనాడులో తీరం వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన గతి తుపాను కొనసాగుతోంది. ఇది పశ్చిమ తీరానికి దూరంగా ఉన్నప్పటికీ, వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర,రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నివారణ కమిషనర్ కన్నబాబు సూచించారు . బుధ, గురు వారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అజలడిగా ఉంటుందని.. మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతాంగం వ్యవసాయ పనులకు సంబంధించి అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తతలో ఉండాలని సూచించారు.
తుపానును దృష్టిలో పెట్టుకొని... తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 25 వరకు జాలర్లు... చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 25 వరకూ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని కోరారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 24, 2020, 6:31 AM IST