• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • NIA RAIDS IN VIPLAVA RACHAYITALA SANGHAM VIRASAM AND HUMAN RIGHTS ACTIVISTS HOMES IN ANDHRA PRADESH AND TELANGANA HERE IS MORE DETAILS SK

తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. విరసం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. విరసం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీమా కోరెగావ్ కేసుతో పాటు విశాఖ ముంచింగిపుట్టు కేసులోనూ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ముంచింగిపుట్టు కేసులో గతంలో 36 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరో 8 మందిపైనా కేసులు పెట్టారు.

  • Share this:
    ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో ఏక కాలంలో సోదాలు చేశారు. విశాఖలోని పిఠాపురంలో అడ్వొకేట్ పద్మ, చిన్నవాల్తేరులో అడ్వకేట్ కే.ఎస్. చలం, రాజమండ్రిలో ఏపీసీఎల్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చిలుకా చంద్రశేఖర్, కర్నూలులో విప్లవ కవి పినాక పాణి, ప్రజా కళా మండలి కోటి, అమరుల బంధుమిత్రుల సంఘం అంజమ్మ ఇంట్లో తనిఖీలు చేశారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం మాజీ మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. గత ఏడాది నవంబరులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై వరలక్ష్మితో పాటు మరో 26 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రభుత్వం గతంలోనే ఈ కేసులను ఎన్ఐఏకు అప్పగించింది.

    హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో అడ్వొకేట్ రఘునాథ్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన ల్యాప్ టాప్‌తో పాటు కంప్యూటర్‌ను పరిశీలించారు. అటు డప్పు రమేష్ ఇంట్లో తనిఖీలు చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీమా కోరెగావ్ కేసుతో పాటు విశాఖ ముంచింగిపుట్టు కేసులోనూ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ముంచింగిపుట్టు కేసులో గతంలో 36 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరో 8 మందిపైనా కేసులు పెట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలపాల యాక్ట్‌తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మావోయిస్టు అగ్రనేతలను తరచూ కలిసి వస్తున్నారని అభియోగాలు నమోదు చేశారు.

    గత ఏడాది నవంబరు 23న నాగన్న అనే వ్యక్తిని పోలీసులు తనిఖీలు చేయగా కీలక విషయాలు బయటకొచ్చాయి. పోలీసుల కదలికలను అతడు మావోయిస్టులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. ముంచింగిపుట్టు పోలీసుల నుంచి ఈ వివరాలను కేంద్రహోంశాఖ సేకరించింది. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసు విచారణలో దర్యాప్తులో ఆయా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఐతే ఎన్‌ఐఏ సోదాలపై విరసం, పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. సోదాల పేరుతో తమను వేధిస్తున్నారని.. పౌర హక్కుల నేతలను భయపెట్టేందుకే సోదాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: