ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే నూతన మోటార్ వాహనాల చట్టాన్ని అమలు చేయనుంది. ఇటీవల ఆమోదించిన ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది. జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో కొత్త నిబంధనలు అమలు చేసేందుకు రంగం సిద్దం చేసింది. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా జేబు ఖాళీ అవ్వాల్సిందే. హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ నడిపితే రూ.1,000 జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధిస్తారు. అంటే రూ.2వేలు చెల్లించాల్సిందే. ఇక బైక్ పై వెళ్తూ ఫోన్ మాట్లాడితే బాదుడు మామూలుగా ఉండదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.1500 జరిమానా కట్టాల్సిందే. మూడేళ్లలోపు రెండోసారి పట్టుబడితే రూ.10వేలు చెల్లించాలి.
మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా.. లైసెన్స్ లేకుండా బైకో, కారో తీసుకొని రొడ్డెక్కారో అంతే సంగతులు. తొలిసారి పట్టుబడితే రూ.5వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10వేలు జరిమానా విధిస్తారు. ఓవర్ స్పీడ్ తో వెళ్తే రూ.1000 , సిగ్నల్ బ్రేక్ చేస్తే రూ.1000 ఫైన్ కట్టాల్సిందే. మైనర్లకు వాహనం ఇస్తే రూ.5,000 చెల్లించాలి. వాహనానికి సరైన ధృవపత్రాలు లేకుంటే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5వేలు చెల్లించాలి. పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్ కు రూ.20,000 జరిమానా విధిస్తారు. ఓవర్ లోడ్ తో వెళ్తూ తనిఖీలకు సహకరించకుంటే రూ.40వేలు జరిమానా విధిస్తారు. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అంబులెన్స్ ఫైర్ ఇంజన్ కు దారి ఇవ్వకుంటే రూ.10వేలు జరిమానా విధిస్తారు. వాహనానికి సంబంధించిన రికార్డులు తారుమారు చేసి విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరికొన్ని జరిమానాలు
కొత్త ఏడాదిలో మీ వెహికల్ కు సంబంధించిన అన్ని పత్రాలు తీసుకెళ్లాలి. అంతేకాదు డ్రైవ్ చేసేటప్పుడు రూల్స్ ను మైండ్ లో పెట్టుకోవాలి. లేదంటే జేబుకు చిల్లుపడటం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.