Andhra Pradesh: ఏపీలో మరో కొత్త మున్సిపల్ కార్పొరేషన్.. వెయ్యి కోట్లతో అభివృద్ధి... ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో కలిపి 2.25 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే కనీసం 3 లక్షల జనాభా ఉండాలి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మరొ కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీతో దాని పరిధిలో ఉన్న 11 గ్రామాలు,తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు పట్టణ పరిధిలో ఉన్న 10 గ్రామాలు మొత్తం 21 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1994 ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలోనే మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.1000 కోట్లు కూడా కేటాయించింది. ఈ ఏడాది జనవరిలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

    ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడ-గుంటూరు మధ్య కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నగర అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లతో డీపీఆర్ రూపొందించాలని ఆదేశించారు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏపీలో మరో కొత్తనగరం ఏర్పాటైనట్లైంది. దీంతో విజయవాడ, గుంటూరు, రాజధాని అమరావతి, ఇప్పుడు మంగళగిరి-తాడేపల్లి ఇలా నాలుగు నగరాలు ఒకేచోట నెలకొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఇది చదవండి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్... అప్రమత్తమైన ప్రభుత్వం…ఇకపై ఇవన్నీ తప్పనిసరి...



    ఇక మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీల హిస్టరీని పరిశీలిస్తే.. 2009 వరకు కృష్ణనగర్‌, తాడేపల్లి మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉండేవి. ఈ రెండు గ్రామాలను కలిపి 2009లో తాడేపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఇక మంగళగిరి నియోజకవర్గ కేంద్రంగా ఉండటంతో 20ఏళ్ల క్రితమే మంగళగిరి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక గ్రాంట్లు అందనున్నాయి. అలాగే కొత్తగా 21 గ్రామాలు కార్పొరేషన్లో కలవడంతో రెండు పట్టణాలతో పాటు ఆయా గ్రామాలు కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టనున్నాయి. ఐతే ప్రజలపై ఆస్తిభారం పెరగనున్నా..ఆ మేరకు మెరుగైన వసతులు అందే అవకాశముంది. తాజా నోటిఫికేషన్ తో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలురానున్నాయి.

    ఇది చదవండి: ఏపీ కొత్త ఎస్ఈసీ ఆమేనా...? జాబితా సిద్ధం చేసిన ప్రభుత్వం



    అభివృద్ధికి ఆస్కారం
    గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న తాడేపల్లి-మంగళగిరి ప్రాంతాలు రాష్ట్రంలో అత్యంత కీలకమైన చెన్నై-కోల్ కతా హైవే పక్కనే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రధాన రహదారికి మధ్యలో ఉన్నాయి. రెండు పట్టణాల మధ్య రెండు, మూడు కిలోమీటర్ల మధ్యలోనే అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాలను విలీనం చేయడం సులువైంది. మరోవైపు తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో కలిపి 2.25 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే కనీసం 3 లక్షల జనాభా ఉండాలి. దీంతో సమీపంలోని 21 గ్రామాలను కూడా విలీనం చేయడంతో జనాభా విషయంలో ఉన్న చిక్కు కూడా వీడిపోయింది. గ్రామాల విలీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇటీవలే వెలువడింది. ఐతే కొత్త కార్పొరేషన్ కు మంగళగిరి-తాడేపల్లిగానే నామకరణం చేస్తారా..? లేక మరేదైనా కొత్తపేరు పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published: