వచ్చే ఏడాది సాధ్యమైనంత తొందరగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ప్రక్రియపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లోని కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే డీజీపీ కూడా సమావేశం నిర్వహించారు. భౌగోళిక, ఆర్థిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఆదాయ వనరులతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన చోట్ల అందుబాటులో ఉన్న ఉద్యోగులనే అప్గ్రేడ్ చేసిన బాధ్యతలు అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పాటు క్రమంలో కొన్ని మండలాలను పునర్ వ్యవస్థీకరించాల్సి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అయితే వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. అయితే ప్రభుత్వం యోచిస్తున్నట్టు మొత్తం జిల్లాల సంఖ్య 26కే పరిమితం కావడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26 దాటొద్దనే యోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని స్పీకర్ కోన రఘుపతి కొద్దివారాల క్రితం వ్యాఖ్యానించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా.. అరకు నియోజకవర్గంలో సంక్లిష్టత ఏర్పడిందని ఆయన తెలిపారు. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అవుతాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts