Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్తగా జిల్లాల ( AP New Districts) ఏర్పాటుపై వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లాల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఏ జిల్లా ఎలా ఉండబోతుందన్నదానిపై క్లారిటీ వచ్చింది. ఐతే కొన్ని జిల్లాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి విడిపోనున్న పల్నాడు జిల్లా స్పష్టత వచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో గుంటూరు జిల్లాలోని నరసరావుపేటను కొత్త జిల్లా కేంద్రంగా మారుస్తారనటంతో పల్నాడు ప్రాంతంలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. అయితే పల్నాడు జిల్లా ఏర్పాటు వెనుకబడ్డ ప్రాంతంలోనే జరగాలన్న డిమాండ్ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలున్నాయి. వీటిలో నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన గుంటూరుకు సమీపంలో ఉండగా.. వెనకబడ్డ గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాలు విద్య వైద్యం ఉపాధి కల్పలనలో వెనుక బడ్డాయి. సాగర్ తీరం చెంతనే ఉన్నా చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదు. పరిశ్రమల ఏర్పాటు.. పరిపాలన సౌలభ్యం మౌలిక వసతుల లేమితో వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వెనకబడ్డ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం చరిత్రక అవసరమన్నారు ఆ ప్రాంత వాసులు.
పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు తెరపైకి రాగానే ఇప్పుడు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధన ఉద్యమం మొదలైంది. పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన కాకుండా.. భౌగోళిక స్వరూపాన్ని ప్రమాణికంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్ధానికులు. గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల పరిధిలోనే జిల్లా ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఈ ప్రక్రియ ఆచరణలోకి వస్తేనే వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి న్యాయం జరుగుతుందని ఈ దిశగానే ప్రభుత్వం నిర్ణయం ఉండాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
అలాగే గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. పెదకూరపాడు నుండి ఏమైనా పనుల కోసం ఆర్డీఓ వద్దకు వెళ్లాలంటే వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని దీంతో ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్ని కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని, లేకపోతే పెదకూరపాడును గుంటూరు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు పెదకూరపాడు ప్రాంత వాసులు.
మరోవైపు జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు కమిటీ తమ పని తాను చేసుకుంటూ వెళ్తోంది. మరోవైపు జనాల నుంచి కొత్త కొత్త డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుతో పాటు పేర్లకు సంబంధించి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కొత్త ఏర్పాటయ్యే జిల్లాకు కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు. జాషువా వినుకొండ ప్రాంతం లో జన్మించారని తన రచనలతో జాషువా ఎంతోమందిలో చైతన్యాన్ని నింపారని జాషువా రచనలు దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఇప్పటి ప్రభుత్వం దళితుల పక్షపాతి అని చెప్పుకుంటున్న తరుణంలో గుంటూరు జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాల్లో గుంటూరుకు గానీ, పల్నాడుకు గానీ జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.