జీవితంలో ఊహించని విపత్తు... పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ (Twitter/Pjhoto)

ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచి, మనో ధైర్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో జనసేన నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.

  • Share this:
    మన జీవితంలో ఎన్నడూ ఊహించని విపత్తుని ఎదుర్కొంటున్నామని, ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచి, మనో ధైర్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో జనసేన నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితుల్లో ప్రభుత్వం పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొంటున్నామని తెలిపారు. ఈ తరుణంలో వీలైనంత మేరకు ప్రజలకు అవసరమైన సాయం చేయడమే ముఖ్యం.. అందుకే సంయమనంతో సున్నితంగా స్పందిస్తున్నట్టు చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాధి మూలంగా తలెత్తిన పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించారు. ‘కరోనా విపత్తు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. అలాగే రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. మన నాయకులు, శ్రేణులు రైతాంగం, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఆటోమొబైల్ రంగం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. చిరు వ్యాపారులు రుణాలు తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ సమస్యలన్నిటిపై సమగ్ర రీతిలో ప్రభుత్వానికి తెలియచేస్తాం.’ అని అన్నారు

    మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు

    ‘ప్రపంచం ఎవరూ ఊహించని పరిణామం ఇది. ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది. పేద ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వారికి అండగా ఉంటూ మానవత్వం బతికే ఉందని మన జన సైనికులు తమ సేవా కార్యక్రమాలతో నిరూపిస్తున్నారు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చినవారు సైతం పెద్ద మనసుతో సాటివారిని ఆదుకొంటున్నారని అభినందించారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
    First published: