Polaa Sudha, News18, Nellore
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ భద్రత కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది. సమాజంలో ఖాకీలది కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూనిఫామ్, క్యాప్, బెల్ట్, లాఠీ, విజిల్ ఇవన్నీ పోలీసులు ధరించాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు పోలీసులు తమ విజిల్‌ను పెట్టుకోవడం మర్చిపోయారు. పోలీస్ స్టేషన్ తనిఖీకి వచ్చిన ఎస్పీ.. ఇద్దరు కానిస్టేబుల్స్ విజిల్స్ మర్చిపోవడాన్ని గుర్తించి, మెమో జారీ చేశారు. నెల్లూరు (Nellore) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు యూనిఫాంతో పాటు వారి వస్తువులను కూడా నిత్యం ధరించాలి. విధి నిర్వహణలో పోలీసు వాడే ప్రతి వస్తువు ముఖ్యమైనదే. అందులో విజిల్ కూడా ఒకటి. అసాంఘిక శక్తుల చర్యల నుండి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీస్ విజిల్ చాలా ఉపయోగపడుతుంది. ఒక్క విజిల్ సౌండ్ వినిపిస్తే చాలు.. ఎక్కడ దొంగలున్నా.. అక్కడ నుంచి పరారైపోతారు. అంతటి శక్తివంతమైంది విజిల్. అయితే ఈ విజిల్ గురించి ఇద్దరు కానిస్టేబుళ్ళు పెద్దగా ఖాతరు చేసినట్లు లేదు. విజిల్ లేకుండా నేరుగా ఎస్పీ విజయరావు కంటికి చిక్కారు.
నెల్లూరు జిల్లా సంతపేటలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ విజయారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, శుభ్రతను పరిశీలించారు. రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. విధుల నిర్వహణపై ఆరా తీశారు. విధుల్లో ఎవరెవరు ఉన్నారు? బీట్‌కు ఎంతమందికి కేటాయిస్తున్నారు? రాత్రి వేళ గస్తీ ఎవరు చేస్తున్నారు? అంటూ ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల డ్రెస్సింగ్, వారు ధరించే వస్తువులను పరిశీలించారు. అయితే ఇద్దరు కానిస్టేబుళ్ళు విజిల్ లేకుండా ఉండడాన్ని ఎస్పీ గుర్తించారు. విజిల్స్ ఎందుకు ఉపయోగించడం లేదు ? ఎందుకు తీసుకురాలేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళకు మెమో జారీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. విధి నిర్వహణలో విజిల్ యొక్క ప్రాధాన్యం, ఉపయోగాలను ఆయన వివరించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక్క మర్డర్ కేసు కూడా పెండింగ్‌లో లేదని, అయితే సంతపేట పీఎస్‌లో మాత్రం ఒక్క హత్య కేసు పెండింగ్‌లో ఉందన్నారు. వీలైనంత వరకు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. రికవరీ చేసేందుకు కానిస్టేబుళ్లకు లక్ష్యాలు నిర్దేశించాలని, దోపిడీ కేసులను ఎస్సైలకు కేటాయించాలని సూచించారు. స్టేషన్లో ఉన్న వాహనాలను పరిశీలించి వేలం వేయాల్సిందిగా సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ కోటారెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.నాగేశ్వరమ్మ తదితర సిబ్బంది ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Nellore Dist