ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా పదులకొద్దీ బీచ్ లు ఉన్నాయి. ఐతే బీచ్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది వైజాగ్ ఆర్కే బీచ్ (Vizag RK Beach). కానీ వైజాగ్ బీచ్ కు ధీటుగా ఏపీలో చాలా ప్రాంతాలున్నాయి. వాటిలో భీమిలి (Bhimili), రిషికొండ (Rishikonda Beach) మాత్రమే కాదు.. దక్షిణ కోస్తాలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఆహ్లాదాన్నిచ్చే బీచ్ లు ఉన్నాయి. ఎన్నో పర్యాటక కేంద్రాలకు నెల్లూరు జిల్లా (Nellore District) పెట్టింది పేరు. అందులోనూ నెల్లూరులోని మైపాడు బీచ్ తప్పనిసరిగా చూడవల్సిన ప్రాంతాల్లో ఒకటి. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా ఉండే ఈ మైపాడు బీచ్ ఎప్పుడూ సందర్శకులతో సందడిగా ఉంటుంది. నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో బీచ్ లు చాలానే ఉన్నాయి. అయితే నెల్లూరు నగరానికి దగ్గరగా ఉన్న బీచ్ మైపాడు కావడం, అక్కడ రిసార్ట్స్‌తోపాటు, ఇతర రిఫ్రెష్‌మెంట్ ఏర్పాట్లు కూడా ఉండటంతో ప్రజలంతా మైపాడు తీరానికి తరలివస్తుంటారు.
వారాంతాలు, పండగల సందర్భంగా మైపాడు బీచ్ సందడిగా మారుతోంది. నెల్లూరు జిల్లాకు వచ్చే పర్యాటకులు కూడా తమ వాహనాల్లో మైపాడు తీరానికి వస్తుంటారు. అక్కడ సేదతీరుతుంటారు. మైపాడు తీరంలోనే ఉన్న శివాలయం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. బీచ్‌లో హార్స్ రైడింగ్, బోటు షికారు లాంటివి కూడా ఉన్నాయి. అంతేకాదు పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది ఏపీ పర్యాటక శాఖ.
ఇక బీచ్ పక్కనే టూరిజం డిపార్ట్ మెంట్స్ వారి గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. ఈ రిసార్ట్స్ కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. బీచ్ చూడటానికి వచ్చేవారు, ఫొటోషూట్స్ కోసం వచ్చేవారు, వెడ్డింగ్ షూట్స్ కోసం వచ్చేవారు ఇక్కడ సేదతీరుతుంటారు. సాయం సమయాల్లో మైపాడు బీచ్ అందాలను వర్ణించడం అసాధ్యం. ఈ బీచ్‌లో ఇసుక బంగారు వర్ణంలో ఉండటమే కాదు… సాయంత్రం అయితే చాలు సూర్యుని కిరణాల వెలుగులో బీచ్‌లోని నీరు కూడా రంగుమారినట్లు కనువిందు చేస్తాయి.
ప్రమాదకరం లేని అలల మధ్య ఆహ్లాదంగా ఆడుకోవచ్చు. ఇక్కడ పర్యాటకులు కూడా చేపలు పట్టొచ్చు. ఇక ఫుడ్ విషయానికి వస్తే చేపలు, రొయ్యలు. పీతలు ఇలా చాలనే ఉంటాయి. ఇక్కడి మత్స్యకారులు పట్టుకొచ్చిన చేపలను అక్కడే వ్యాపారులు కొని రెడీ చేసి ఉంచుతారు. ఈ బీచ్ స్పెషలగా ATV బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని రైడ్ చేసిన పర్యాటకులు వారి ఆనందం అంతా ఇంతాకాదు.
నగరానికి సమీపంలోనే బీచ్ ఉండటంతో.. నగరవాసులు కూడా తరచూ ఇక్కడికి వస్తుంటారు. బీచ్‌లో సేదతీరుతుంటారు. వీకెండ్స్ వచ్చినా, సెలవులు వచ్చినా… చిన్నా, పెద్దా అంతా కలిసి ఇక్కడకు వచ్చిఎంజాయ్ చేస్తుంటారు. నెల్లూరు నుంచి మైపాడుకు వెళ్లే దారి అంతా ప్రకృతి పరిచినట్లు ఇంకా చెప్పాలంటే మరో కోనసీమలా ఉంటుంది. పచ్చదనం, ప్రశాంత వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ బీచ్‌కు వెళ్లారంటే మళ్లీ మళ్లీ వెళ్లాలనుకుంటారు. అంతటి జ్ఞాపకాలను మీకు ఈ బీచ్ అందిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఆరుగంటల వరకు ఈ బీచ్ తెరిచి ఉంటుంది.
అడ్రస్: మైపాడు బీచ్, ఇందుకూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్- 524313..
ఎలా వెళ్లాలి?
నెల్లూరు నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైపాడుకి ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి ప్రధాన నగరం నుంచి నెల్లూరుకు రైల్వే మార్గం ఉంది. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుంచి మైపాడుకు వెళ్లొచ్చు. ఇక వ్యక్తిగత వాహనాల్లో కూడా ప్రజలు మైపాడు బీచ్‌కి వస్తుంటారు. వారాంతాల్లో ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Nellore