Polaa Sudha, News18, Nellore
ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు చోరీ చేయడంతో పాటు విగ్రహాలను కూడా దోచుకెళుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో దేవాలయాలకు రక్షణ లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ ఆలయాల్లో చోరీల ఘటనలు ఎక్కువగా జరుగుతుండడం కలకలం రేపుతోంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణం వాసిలిలోని హరిజనవాడలోని రామాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గతరాత్రి కూడా పూజలు, అభిషేకాలు, హోమాలు, భక్తుల దర్శనాలు అన్నీ పూర్తయిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచే సమయానికి.. గర్భగుడి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు.
ఆలయంలో ఉండాల్సిన పంచలోహ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. గర్భాలయంలోని సీతారామ లక్షణులు, ఆంజనేయస్వామి విగ్రహాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగిందని గుర్తించిన అర్చకులు, స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ శివశంకరరావు తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి, వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇది తెలిసిన వారి పనేనా లేక వేరే వారెవరైనా దొంగతనం చేశారా ? ఆలయాల్లో చోరీకి పాల్పడే పాత నేరస్తులా అని వివిధ కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలయంలో చోరీకి గురైన పంచలోహ విగ్రహాల విలువ దాదాపు పది లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. ఆత్మకూరు పట్టణమే కాదు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దేవాలయాలనే టార్గెట్ చేసుకుని దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉదయం పూట రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. హుండీలు పగలగొట్టి అందినకాడికి దోచుకెళుతున్నారు.
కొంతమంది ఆలయంలోని విగ్రహాలను కూడా ఎత్తుకెళుతున్నారు. ఆలయంలో భగవంతుడికే రక్షణ లేకపోవడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల వద్ద నిరంతరం నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయ దొంగలను అణచివేయడంలో, దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Nellore Dist