Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ (Loan Apps) ల ఆగడాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అయితే ఈ లోన్ యాప్ ల ఆగడాలు మంత్రులు, మాజీ మంత్రులను కూడా తాకాయి. సామాన్యుల నుండి నాయకుల వరకు వేధింపులు తప్పలేదు. లోన్ యాప్‌ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వీరివద్ద ఋణం తీసుకుంటే అంతే సంగతులు. ఆ మాఫియా వేధింపులకు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. చాలా మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈజీగా లోన్లు ఇచ్చేసి సకాలంలో చెల్లించకపోతే మానిసంగా వేధిస్తూ జీవితంపై విరక్తిపుట్టేలా చేస్తారు. ఆ వేధింపులు తట్టుకోలేని వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. డబ్బులు అవసరమై లోన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోగానే.. వెంటనే రుణాలు ఇచ్చేస్తారు.
సకాలంలో చెల్లించకపోతే వడ్డీకి చక్రవడ్డి దానిపై బారువడ్డీ లేట్ ఫీజులు, పెనాల్టీల రూపంలో ఇచ్చిన దానికంటే నాలుగైదు రెట్లు అధికంగా వసూలు చేస్తుంటారు. అంతేకాదు అప్పుతీసుకున్న వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారందరికీ పంపించి మానసికంగా వేధిస్తారు. అసభ్య చిత్రాలు, మేసేజ్ లు పంపుతారు. ఫోటోపై దొంగ అని ముద్రవేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అక్కడితో ఆగకుంటే ఇంట్లో ఆడవాళ్ల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తారు.
ఇలాంటి కేసులను సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసులు ప్రజలెవరూ లోన్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. హిట్ సినిమా డైలాగులను మీమ్స్ రూపంలోకి మార్చి సోషల్ మీడియా (Social Media) లో సర్క్యులేట్ చేస్తున్నారు. సూపర్ హిట్ సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల్లో ఫేమస్ డైలాగులను లోన్‌యాప్స్ వేధింపులకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు.
ప్రజలకు లోన్ అప్స్పై అవగాహన కలిగించేందుకు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా 1930 హెల్ప్ లైన్ నెంబర్‌పై అవగాహన కల్పిస్తూ జనాన్ని యాప్స్ బాధనుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎవరైనా సైబర్ మోసానికి గురైనప్పుడు 48 గంటల్లోగా ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల ఉలవపాడుకు చెందిన ఓ మామిడికాయల వ్యాపారి.. లోన్ యాప్ ద్వారా అప్పుతీసుకున్నాడు. అధిక వడ్డీ డిమాండ్ చేయడంతో ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో అతడి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సదరు వ్యక్తి ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారందరికీ పంపారు. ఐతే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వేధింపులు ఆగిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Loan apps, Nellore