మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అత్యధికంగా స్వర్ణాభరణాలు తయారుచేసే జిల్లా ఏంటంటే ఎవ్వరైనా ఠక్కున నెల్లూరు (Nellore) అనేస్తారు. అంతాగా బంగారు ఆభరాణాల తయారీకి నెల్లూరు పెట్టింది పేరు. నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున గోల్డ్ జ్యూయెలరీ (Gold Jewelry) విభిన్నంగా తయారు చేస్తుంటారు. నెల్లూరులో కేవలం బంగారు ఆభరణాలపై కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యం కలగకమానదు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ఉన్నారు. పేరులో స్వర్ణం ఉన్నా.. వారి జీవితాల్లో మాత్రం అది లేదు. ఎవరి మీద ఆధారపడని బడుగు జీవులు. వందల ఏళ్ళ నుంచి వృత్తినే దైవంగా నమ్ముకుని పని చేస్తుంటారు. వాళ్ళే స్వర్ణకారులు. వృత్తి పరంగా వీరు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. చే
తినిండా పని లేకపోవడంతో చాలామంది స్వర్ణకారులకు పూట గడవడడం కూడా కష్టంగా మారింది. అయినా ఎవరి వద్ద చేయిచాచరు. ఎవరి మీద ఆధారపడరు. వీలైతే కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే బంగారు మనసు కూడా వీరి సొంతం. నెల్లూరులో ఎన్నో స్వర్ణకార కుటుంబాలున్నాయి. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ వృత్తినే ఎంచుకుని జీవిస్తున్నారు. చిన్నబజారు, మండపాలవీధి, ఆచారి వీధి తదితర ప్రాంతాల్లో దుకాణాలు కూడా ఉన్నాయి.
పూర్వీకులు ఇచ్చిన ఈ వృత్తిని కొనసాగిస్తూ నేటి తరం కూడా పని చేస్తున్నారంటే.. తమ వృత్తిపై వారికి ఎంత గౌరవం ఉందో, ఎంత అనుబంధం ఉందో మాటల్లో చెప్పలేనిది. ఒకప్పుడు చేతినిండా పని ఉండడం వల్ల ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించారు స్వర్ణకారులు. ఎంతోమంది ఖాతాదారులు తమకు నచ్చిన ఆభరణాలను చేయించుకుని మురిసిపోయేవారు. కానీ కార్పోరేట్ శకం ఆరంభం కావడం, రెడీమేడ్ బంగారు ఆభరణాలు మార్కెట్‌లోకి విస్తారంగా రావడం.. స్వర్ణకారుల జీవితాలను చీకట్లోకి నెట్టేసిందని చిన్నబజారు సెంటరులోని కొరడావీధికి చెందిన స్వర్ణకారుడు షేక్ అలీం తెలిపారు.
ఎంత కష్టం వచ్చినా ఎవరి మీదా ఆదారఫడని బడుగు జీవులు స్వర్ణకారులు. వృత్తినే దైవంగా నమ్ముకుని పని చేస్తుంటారు. బంగారు ఆభరణాల తయారీలో వారిది అందె వేసిన చేయి. నెల్లూరు నగరంలోని హోల్ సేల్ షాపుల యజమానులు వీరి వద్దే ఆభరణాలు తయారు చేయించుకుని వెళుతుంటారు. షేక్ అలీం కేవలం స్వర్ణకారుడే కాదు.. సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
బంగారు ఆభరణాల తయారీ వృత్తిపై ఆధారపడి... స్వర్ణకారులతో పాటు మెరుగుపట్టేవాళ్లు, అందంగా నగలను చెక్కే వాళ్లు, రాళ్లు, డైమండ్స్ బిగించేవారు, పాలిష్ పట్టేవాళ్లు... ఇలా ఎంతో మంది ఆధారపడి ఉంటున్నారు. కానీ, ఇప్పుడు బంగారు ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోయిందని అలీం తెలిపారు. దీంతో కుటుంబ పోషణ, షాపుల అద్దెల చెల్లింపులు చేయడం కూడా గగనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు బంగారం ధరలు పెరగడంతో బంగారం కొనేవారే తక్కువయ్యారన్నారు.
బంగారు, వెండి నగలకు మెరుగులు దిద్దే కార్మికులే స్వర్ణకారులు. మగువలు ధరించే అందమైన ఆభరణాల వెనక కనపించని శ్రామికులు ఎందరో.. మనం మెచ్చే బంగారానికి ఉన్న మెరుగు తమ బతుకులలో మాత్రం లేదని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Nellore