చదరంగం..! (Chess) భారతదేశం (India) లో పుట్టిన మేథోసంపత్తిని పెంచే ఆట.. ఈ ఆటను ఇద్దరు కలిసి అరవై నాలుగు గళ్ళు కలిగిన ఒక చదరపు బల్ల మీద ఆడతారు. పిల్లలు మొదలు వృద్దుల వరకు ఎంతోమంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ ఆట పట్ల పిల్లలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో నెల్లూరు (Nellore) లో ఎంతోమంది పిల్లలు చెస్ గేమ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. చిన్నతనం నుంచే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్‌లో అతిపెద్ద చెస్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ పిల్లలు, పెద్దలు చదరంగం ఆడుకునేందుకు పెద్ద చెస్ బోర్డ్‌ను పెట్టారు. చెస్ బోర్డ్ అంటే సాదాసీదాది కాదు. నేల మీద పెద్ద పెద్ద గడులతో తయారుచేశారు.
పెద్ద పెద్దగా ఉండే పావులను ఇక్కడ ఏర్పాటుచేశారు. అయితే మన ఇంట్లో ఆడినట్లు కూర్చుని ఆడటానికి లేదు. ఎవరైనా ఇక్కడ చెస్ ఆడాలంటే నిలబడి తీరాల్సిందే. చదరంగం బోర్డు మీద ఒక్కో పావును కదిలించాలంటే రెండు చేతులను ఉపయోగించి ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏర్పాటుచేసిన ఈ చదరంగం బోర్డు మీద ఆడేందుకు పిల్లలు ఉత్సాహం చూపిస్తున్నారు. రోజూ సాయంత్రం వేళలో చిల్డ్రన్స్ పార్కు వద్ద పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతుంటారు. వాటిలో ఎక్కువగా చదరంగం ఆడేందుకు వస్తుంటారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ చెస్ గేమ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తూంటారు.
మనం ఇంట్లో ఆడే చెస్బోర్డ్లో పావులు 2 నుంచి 3 అంగుళాలు ఉంటాయోమో..!కానీ ఈ పార్క్‌లో ఏర్పాటు చేసిన జంబో చెస్ బోర్డులో మాత్రం మూడు అడుగుల పావులు ఉంటాయి. అందుకే ఈ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఈ జెయింట్ చెస్ బోర్డులో ఆడటం అంటే అంత ఈజీ కాదు. మన ఇంట్లో తాపీగా కూర్చుని రిలాక్స్డ్గా ఆడటం కాదు. ఇక్కడ పావులను మనమే అటు ఇటు తిరుగుతూ కదపాల్సి ఉంటుంది. దీనివల్ల ఒకే సమయంలో శరీరానికి ఎక్సర్‌సైజ్‌తో పాటు మెదడుకు పదును పెట్టొచ్చు. పార్క్‌లో పచ్చని ప్రకృతిలో ప్రశాంతమైన వాతావరణంలో ఆడటం ఎంతో సరదాగా, బాగుంటుందని ప్లేయర్స్ చెబుతున్నారు. వీకెండ్స్‌లో చాలా మంది వచ్చి ఇక్కడ చెస్‌గేమ్ ఆడుతూంటారు.
అసలు చెస్ బోర్డులో ఏమేం ఉంటాయి..?
చెస్ గేమ్ ఆడాలంటే ముందు బ్లాక్ అండ్ వైట్ గడులతో ఉన్న ఒక బోర్డు తప్పనిసరిగా ఉండాలి. ఆ బోర్డులో ఆడేందుకు నలుపు, తెలుపు పావులు కావాలి. ఒక ప్లేయర్ తెలుపురంగు పావులను ఎంచుకుంటే మరొక ప్లేయర్ నలుపు రంగు పావులను ఎంచుకుంటారు. ఆట ఆరంభంలో 16 తెల్ల పావులు, 16 నల్ల పావులను గేమ్ రూల్స్ ప్రకారం సక్రమంగా అమర్చుకోవాలి.
తెల్ల పావులను ఒక ప్లేయర్ నియంత్రిస్తే నల్ల పావులను మరొకరు కదుపుతూ ఆడతారు. 16 పావులలో ఒక రాజు (king), ఒక మంత్రి, రెండు ఏనుగులు (rooks), రెండు గుర్రాలు (knights), రెండు శకటాలు (bishops), ఎనిమిది బంట్లు (pawns) ఉంటారు. ఈ ఆటలో ఎదురుగా ఉన్న ఆటగాడి రాజును చెక్మెట్ చెయ్యడమే.. అంటే ఆ రాజుకు మన దగ్గర ఉన్న ఏదో ఒక పావుతో చెక్ పెట్టాలి. ఆ సమయంలో ఎదుటి రాజుకు ఆ దాడి నుండి తప్పుకోవటానికి అవకాశం లేకుండా చేయడమే ఈ గేమ్ ఉద్దేశం. ఎత్తులు, పై ఎత్తులు, యుక్తులతోనే ఈ ఆటను ఆడగలం.
ఈ ఆటలో ఏకాగ్రత చాలా అవసరం. అందుకే ఈ ఆటను చిన్నతనం నుంచే నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు. వాళ్ల ఆలోచనా విధానం కూడా మెరగవుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో పేరెంట్స్ వాళ్ల పిల్లలకు చెస్ గేమ్‌ను నేర్చించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
మీరు నెల్లూరులో ఉండేవాళ్లే అయితే తప్పకుండా మీ పిల్లలను ఒక్కసారి ఈ చిల్డ్రన్స్ పార్క్‌కు తీసుకెళ్లండి. మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడ్డ పిల్లలు..ఒక్కసారి ఈ పార్క్‌లోని అతిపెద్ద చెస్‌బోర్డును చూస్తే వాళ్లే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. మొదట్లో అలవాటు పడ్డా తర్వాత చెస్ నేర్చుకుంటారు. మిమ్మల్ని నేర్పించమని పట్టుబడతారు.
అడ్రస్: చిల్డ్రన్స్ పార్క్, రాంజీ నగర్, నెల్లూరు , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్-
టైమింగ్స్: ఉదయం 4.45 నుంచి 9.30, సాయంత్రం 4 గంటల నుంచి 9.45 వరకు ఈ పార్క్ తెరిచి ఉంటుంది.
ఎలా వెళ్లాలి..?
నెల్లూరు బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chess, Local News, Nellore Dist