Pola Sudha (News18, Nellore)
ప్రపంచంలో మరెక్కడా లేని అద్భుతం నెల్లూరు (Nellore)లో ఉంది. మనం రోజు రైళ్లలో ప్రయాణం చేస్తుంటాం. రైల్వే ట్రాక్‌ల పక్కల ఎప్పుడైనా ఆలయాలు, చర్చీ, మసీదులు చూశారా? మరి ముఖ్యంగా రెండు రైల్వే ట్రాక్‌ల మధ్యలో..! అదేం ప్రశ్న అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మన ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన నెల్లూరులో రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య ఓ దర్గా ఉంది. నెల్లూరు నగరంలో ఓ అరుదైన దర్గా ఉంది. ఆ దర్గా (Dargah) పేరు హజరత్ సయ్యద్ మొహిద్దిన్ షావలి ఖాదరి దర్గా. ఈ దర్గా నెల్లూరు రైల్వే స్టేషన్‌కి సమీపంలో ఉంటుంది. బహుశా దేశంలో ఏ దర్గాకు కూడా ఇలాంటి ప్రత్యేకత ఉండదేమో అనిపిస్తుంది. రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య ఈ దర్గా ఏర్పాటు చేశారు.
నెల్లూరు పెన్నా నది (Penna)కి సమీపంలో, రంగనాయకుల గుడి సమీపంలోనే ఈ దర్గా ఉంటుంది. ఎన్నో ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో షావరి ఖాదరి, ఆయన భార్య..ఇద్దరూ అల్లా సేవలోనే జీవితమంతా గడిపేశారు. ఖాదరి అతని భార్య ఇద్దరు పవిత్ర ఖురాన్‌లోని విషయాలను గ్రహిస్తూ ఆచరిస్తూ..తమ వద్దకు వచ్చేవారి కష్టనష్టాలను విని వారికి చేతనైనంత సాయం చేస్తూ.. సేవచేసుకుంటూ జీవనం సాగించేవారు. వారి చివరి రోజుల్లో ఈ ప్రాంతంలోనే జీవసమాధి అయ్యారు.
రైల్వే ట్రాక్‌కి అడ్డుగా ఉందని ఆనాటి బ్రిటిషర్లు దర్గాని తరలించే ప్రయత్నం చేసినా కుదరలేదు. ప్రతిరోజు కూలీలంతా కష్టపడి ఇనుప ట్రాక్‌లను వేసి వెళ్లేవారు.. తర్వాత రోజు వాళ్లు వచ్చేసరికి అవి అన్ని వంగిపోయి ఉండేవట. ఎవరు ఇలా చేస్తున్నారో తెలియక అసలు భూమిలో ఏముందని బ్రిటిష్ అధికారులు తవ్వి చూస్తే అక్కడ ఖాదరి దంపతుల సమాధులు ఉన్నాయట. దీంతో బ్రిటీష్ వాళ్లే ఆ సమాధిని కదిలించకుండా దానికి అటు ఇటు వైపులా రైల్వే ట్రాక్‌ను నిర్మించారని మతపెద్దలు చెబుతున్నారు. దీంతో రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య దర్గా అలానే ఉండిపోయింది.
ఈ దర్గా 15 అడుగుల లోతుకి ఉన్నా కూడా వర్షం పడినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెన్నాకు వరదలు వచ్చిన సమయంలో కూడా ఇందులోకి నీరు వెళ్లలేదు. ఈ ప్రాంతానికి నీరు వచ్చినా…కొద్ది సేపటికే నీరంతా వెళ్లిపోతాయి. ఎటు వైపు వెళ్తాయో ఎక్కడికి పోతాయో అంతుచిక్కదు.. ఇదే ఇక్కడి మహిమ అని చెబుతుంటారు దర్గా పీఠాధిపతులు. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉన్నా కూడా.. దర్గాకు వచ్చేవారికి కానీ ఈ రైల్వే గేట్ దాటేవారికి కానీ ఎప్పుడూ ఎక్కడా చిన్న ప్రమాదం కూడా జరగలేదు. అదే ఇక్కడి మహిమగా చెబుతుంటారు స్థానికులు.
రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య ఉన్న ఈ దర్గాను చూసేందుకు భక్తులు ప్రతిరోజూ వస్తుంటారు. ఇక్కడే దర్గాలో సమాధులను దర్శించి అక్కడ దీపం పెట్టి వెళ్తుంటారు. సంతానం లేని వారికి ఇక్కడికి వస్తే సంతాన యోగ్యం ఉంటుందని చెబుతుంటారు. అలాగే వివాహం కానివారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు ఇక్కడికి వచ్చి సమాధులను దర్శించుకుని వెళ్తుంటారు.
ఈ దర్గా పక్కన ఉన్న రైల్వే ట్రాక్‌లు విజయవాడ- తిరుపతి , విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైళ్లు వెళ్తుంటాయి. అంటే దాదాపు ప్రతి 15 నిమిషాలకు ఒక ట్రైన్ ఈ మార్గం నుంచి వెళ్తుంది. అయినా సరే మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ ట్రాక్‌ను దాటుకుని వచ్చి దర్గాలో ప్రార్థనలు చేస్తుంటారు. అంతేకాదు ప్రతి ఏటా రొట్టెల పండగ జరిగే సమయంలో ఇక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజు ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ప్రతి ఏటా మొహరం రోజు ఇక్కడ గంధమహోత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో నెల్లూరు జిల్లా వాసులే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా నెల్లూరుకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఈ నెల్లూరు సిటీలో వసతి సౌకర్యాలకు కొదవే ఉండదు. అందుకే మొహరం, లేదా ఏమైనా మొక్కుబడులు ఉన్నాకూడా దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
అడ్రస్: ఖాదరి దర్గా, నెల్లూరు రైల్వేస్టేషన్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్-524001
ఎలా వెళ్లాలి?
నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి కాస్త బయటకు వస్తే ఈ దర్గా కనిపిస్తుంది. నడిచేంత దూరంలోనే ఉంటుంది. అంతేకాదు నెల్లూరు బస్టాండ్ నుంచి కూడా ఈ దర్గాకు నడిచి వెళ్లొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Local News, Nellore, VIRAL NEWS