YCP Clasesh: గత ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్డగా మారిన జిల్లాల్లో నెల్లూరు (Nellore) ఒకటి.. కానీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మారుతోందా..? కానీ దానికి కారణం ప్రతిపక్షాలు పుంజుకోవడం కాదు.. సొంత పార్టీ నేతల తీరే పార్టీని కష్టాల్లోకి నెడుతోందా..? ముఖ్యంగా మొన్నటి మంత్రివర్గ విస్తరణ తరువాత పార్టీలో అసమ్మతి జ్వాలు భారీగా ఎగసిపడ్డాయి. నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ (YCP) అందరూ సీనియర్ నేతలే ఉన్నారు. అందులో ఎక్కువమంది జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కు విధేయులుగానే గుర్తింపు పొందారు. ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Ex Minster Anil Kumar Yadav), ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardan Reddy) మద్య మొదలైన రాజకీయ రచ్చ ఇంకా ఆగడం లేదు. ఒకరిపై ఒకరి విమర్శలు ఆగడం లేదు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బహిరంగంగానే సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అందరి లెక్కలు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేవలం ఈ ఇద్దరే కాదు.. జిల్లాలో ఉన్న వైసీపీ నేతలంతా ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఆ ఎమ్మెల్యే మాత్రం.. కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా ఉంటారు. ఆ వైఖరి వెనక ఏదో మతలబు ఉందనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam reddy Sridhar Reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. విద్యార్ధి దశలో ABVP నాయకుడిగా పనిచేస్తే.. రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్ నేతగా ఎదిగి.. ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు శ్రీధర్‌రెడ్డి. ప్రజల అటెన్షన్ కోసమో ఏమో.. వినూత్న నిరసనలు చేపడుతుంటారు. విపక్షంలో ఉన్నా.. ఇప్పుడు అధికరపక్షంగా మారినా ఆయనలో ఎలాంటి మార్పు లేదన్నది పార్టీ వర్గాల మాట.
ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఆశించారు. కానీ.. ఛాన్స్ దక్కలేదు. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలోనూ ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. కేబినెట్లో చోటు ఆశిస్తున్నట్టు ఓపెన్‌గానే చెప్పేశారు శ్రీధర్‌రెడ్డి. కానీ.. జిల్లా నుంచి కాకాణి గోవర్దన్‌రెడ్డికి అవకాశం ఇవ్వడంతో .. మీడియా ముందుకొచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. పార్టీలో తనకంటే సీనియర్ ఎవరు అని ప్రశ్నలు సంధించారు ఈ ఎమ్మెల్యే. అప్పటి నుంచి రూటు మార్చేసి.. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు శ్రీధర్‌రెడ్డి.
ఇదీ చదవండి : మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..
అప్పటి నుంచే ఆయన వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముఖ్యంగా అధికారుల తీరుతో నష్టం జరుగుతోందని శ్రీధర్‌రెడ్డి కస్సుమంటారు. గడువులోగా పనులు జరగకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించడం ఆయనకే చెల్లింది. ప్రతి సమావేశంలో ఆయన తీరు గతకంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందట. ఆ మధ్య ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్యపై కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఇక జగనన్న కాలనీ లేఅవుట్ విషయంలో అధికారిక సమావేశంలోనే కస్సుమన్నారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి. మూడునెలల్లో లేఅవుట్ భూమిని చదును చేయకపోతే నిరసన తప్పదని వార్నింగ్ ఇచ్చేశారు. అయితే ఆయన అధికారులను టార్గెట్ చేస్తున్నా.. ఎమ్మెల్యే ప్రధాన టార్గెట్ మాత్రం.. అధిష్టానమే అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kotamreddy sridhar reddy, Nellore Dist, Ycp