Polaa Sudha, News18, Nellore
నెల్లూరులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) ప్రారంభమైంది. 13 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్ధులు ఈ నియామక ర్యాలీకి హాజరయ్యారు. 12 రోజుల పాటు జరిగే ఈ ఎంపికకు అధికారులు సర్వం సిద్ధం చేసింది. 12 ఏళ్ళ తర్వాత జిల్లాలో ఆర్మీ ర్యాలీ జరుగుతుండటంతో.. జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పేరుతో దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలు (Agniveer Recruitment Rally) నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరులోనూ ఈ ర్యాలీని చేపట్టింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఈ ర్యాలీ లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లాకు ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 15న మొదలైన ర్యాలీ.., 26వ తేదీ వరకు ర్యాలీ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి షహజాద్ కోహ్లీ, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, కమిషనర్ హరిత, ఎస్పీ విజయరావు పలుమార్లు ర్యాలీ నిర్వహణపై సమీక్షలు కూడా జరిపారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ ట్రేడ్‌మెన్‌లను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 34 వేల మంది, నెల్లూరు జిల్లా నుంచి 970 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల కోసం జిల్లా అధికారులు సౌకర్యాలు కల్పించారు. ర్యాలీ జరుగుతున్నప్పుడు నెల్లూరు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ఎంపికలకు వచ్చే అభ్యర్థులను ముందుగా నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అక్కడ అటెండెన్స్ తీసుకుని.. ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. అభ్యర్ధుల ఎత్తు పరిశీలించిన అనంతరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోకి అనుమతిస్తారు. ఆసుపత్రి ప్రాంగణంలో 10 కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో దానిలో 300 మంది చొప్పున, రోజుకు 3 వేల మందిని అనుమతించనున్నారు. ఎవరు ముందు వస్తే.. వారికి టోకెన్లు ఇవ్వనున్నారు.
త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకు వచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పది హేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది రిక్రూట్మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో అర్హత సాధించిన 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agniveer, Andhra Pradesh, Local News, Nellore