Home /News /andhra-pradesh /

NEARLY 3000 KG HEROIN SEIZED AT MUNDRA PORT IN GUJARAT WHICH IS READY TO SHIP TO VIJAYAWADA SK

Heroin Seized: రూ.9వేల కోట్ల హెరాయిన్.. విజయవాడకు తరలిస్తుండగా సీజ్.. ఆఫ్ఘన్ నుంచి సప్లై

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Heroin Seized in Gujarat: ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్లలో వచ్చిన ఆ హెరాయిన్ సంచులు.. గుజరాత్‌ మీదుగా ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.

  దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ (Drugs Racket) గుట్టురట్టయింది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోల హెరాయిన్ (Heroin) పట్టుబడింది. దాని విలువ రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. ఐతే దీనికి ఏపీతో లింకులుండడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్లలో వచ్చిన ఆ హెరాయిన్ సంచులు.. గుజరాత్‌ (Gujarat) మీదుగా ఏపీలోని విజయవాడ (Vijayawada)కు వెళ్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించారు. సెప్టెంబరు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు (Mundra Port)లో రెండు కంటైయినర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అందులో బ్యాగుల్లో నింపిన పౌడర్ లాంటి పదార్థం కనిపించింది. ఏంటని ఆరా తీస్తే.. టాల్కమ్ పౌడర్ (Talcum powder) అని దాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు చెప్పారు. ఐనా అధికారులకు అనుమానం తొలగలేదు. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తే అది హెరాయిన్ అని తేలింది. అంత భారీ మొత్తంలో హెరాయిన్ ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు.

  ఒక కంటైనర్‌లో 1999.579 కిలోల హెరాయిన్ దొరికింది. రెండో కంటైనర్‌లో 988.64 కేజీలు పట్టుబడింది. మొత్తంగా 2988.219 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్ఘానిస్తాన్‌ (Afghanistan) నుంచి టాల్కమ్ పౌడర్ ముసుగులో హెరాయిన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. అప్ఘాన్‌లోని కాందహార్ (Kandahar)కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ ఇరాక్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ముంద్రా పోర్టుకు తరలించారు. ముంద్రా నుంచి విజయవాడ (Vijayawada)కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. ఆ డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ సంస్థ(Ashi trading company)కు వెళ్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్ని కంటైనర్లు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? అనే వివరాలను కూపీ లాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, గుజరాత్‌లోని గాంధీ ధామ్, మాంద్వీలో అధికారులు సోదాలు చేశారు.

  AP Elections Counting: వైన్ షాపులో చల్లని బీరు కావాలి.. ఓటుతో పాటు మందుబాబుల లెటర్ వైరల్..

  ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఎవరిది?
  ఆషీ ట్రేడింగ్ కంపెనీ.. విజయవాడలోని సత్యనారాయణపురంలోని గడియారంవారి వీధి అడ్రెస్‌తో 2020 ఆగస్టు 18న రిజిస్టరయింది. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు పేరిట ఈ కంపెనీని స్థాపించారు. బియ్యం, పప్పులు, పండ్లు, కూరగాయలు టోకు వ్యాపారం కోసం స్థాపించినట్లు పేర్కొన్నారు.  ఆ కంపెనీ ప్రతినిధులను  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారగా..  వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. ఆషీ ట్రేడింగ్ కంపెనీ మూలాలు.. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకు విస్తరించి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన ఫోన్ నెంబర్ మాత్రం ఎం.సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఐతే అధికారులు దానికి కాల్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. ఆ ఫోన్ నెంబర్‌తో ఉన్న వాట్సప్ ప్రొఫైల్‌లో మాత్రం ఆషీ సోలార్ సిస్టమ్ అనే కంపెనీ పేరు చూపిస్తోంది. చెన్నై కేంద్రంగా ఈ కంపెనీని సుధాకర్ నెలకొల్పినట్లు తెలిసింది.

  Bad luck: దురదృష్టమంటే ఇదే..! 20 లక్షలు క్యాష్, 50 కాసుల బంగారం బుగ్గిపాలు

  సుధాకర్ ఎవరు?
  ఎం. సుధాకర్ స్వస్థలం కాకినాడ. ఎనిమిదేళ్లుగా చెన్నై శివారులో ఉంటున్నాడు. పోరూరులోని కోలపాకంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఐతే సెప్టెంబరు 15న డీఆర్ఐ అధికారులు సరుకును పట్టుకున్న తర్వాత.. కంపెనీ వివరాల ఆధారంగా చెన్నై శివారులోని సుధాకర్‌ ఇంటికి వెళ్లారు పోలీసులు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. కంపెనీ వివరాల్లో ఉన్న మరో వ్యక్తికి ఫోన్ చేస్తే.. సుధాకర్ గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. తాను సోలార్ పవర్ వ్యాపారం చేయాలనుకుంటున్నానని.. అందుకు సాయం చేయాల్సిందిగా పక్కింట్లో ఉండే యువకుడిని కొన్ని నెలల క్రితం సుధాకర్ సంప్రదించినట్లుగా తెలిసింది. ఆ యువకుడు ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఆ తర్వాత అతడి ఫోన్ నెంబర్‌ను కూడా ఆషీ సోలార్ సిస్టమ్ కంపెనీ కాంటాక్ట్స్ లిస్టులో పొందుపరిచాడు. ప్రస్తుతం సుధాకర్ ఎక్కడ ఉన్నాడన్నది తెలియడం లేదు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుధాకర్ నెంబర్‌తో ఉన్న వాట్సప్ చివరిగా సెప్టెంబరు 15న చూసినట్లు ఉంది. అతడి దొరికితే ఈ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశముంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Drugs, Drugs racket, Heroin, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు