ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ (YS Jagan) రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెట్టబోతున్నామంటూ టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) బాంబ్ పేల్చారు. జగన్ టైం అయిపోయిందని.. ఇంటికెళ్లే సమయం దగ్గర పడిందంటూ లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డివి పది పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలంటన్న లోకేశ్.. రాష్ట్రంలో పెట్టబుడులు (AP Investments) పెట్టాలంటే సీఎంఓలో వాటా ఎంత ఇవ్వాలనే చర్చ జరుగుతోందని విమర్శించారు. మంగళగిరిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాటల దాడి చేశారు.
జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవని.. అన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలేనంటూ లోకేశ్ వ్యంగ్యంగా విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డికి టైం అయిపోయిందని.. ఇంటికెళ్లే సమయం అతి దగ్గర్లోనే ఉందన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంఓలో వాటా ఎంత ఇవ్వాలనే చర్చ జరుగుతోందని.. గత మూడేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు.
జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వం కృషేనంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు. దాదాపు 500 హామీలు ఇచ్చి మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించాలా అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ భయంతో ఢిల్లీలో మెడలు వంచుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని.. మంగళగిరిలో విజయవంతం అయిన కార్యక్రమాలు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్ లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని నారా లోకేశ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభమైందని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగలేని.. డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కోసం సంజీవని ఆరోగ్య కేంద్రం అని లోకేశ్ అన్నారు.
ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామగ్రిని తన సొంత ఖర్చులతో లోకేశ్ సమకూర్చారు. ఒక జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఈ వాహనంలో ఉంటారు. ఆరోగ్య కేంద్రంలోనే 200కి పైగా రోగనిర్ధారణ పరీక్షలు కూడా పూర్తిగా చేయొచ్చు. అవసరమైనవారికి ఉచితంగా మందులు కూడా ఇందులోనే అందజేస్తారు. అందరికీ ఆరోగ్యమస్తు- ప్రతీ ఇంటికీ శుభమస్తు అనే నినాదంతో ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి తెచ్చినట్లు లోకేశ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nara Lokesh, TDP, Ys jagan, Ysrcp