Nandi Idol: ఏపీలో నంది విగ్రహం ధ్వంసం, ఈ సారి మరో జిల్లాలో

చిత్తూరు జిల్లాలోని అగరమంగలం గ్రామంలోని శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని అనంగమంగలం గ్రామంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో నంది విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

 • Share this:
  Nandi Idol Vandalised in AP: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు హిందూ దేవాలయాల్లో మరోవైపు చర్చిల్లో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దాంతో ఏపిలో రాజకీయం వేడెక్కింది. తాజాగా ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక్షవర్గంలో ఆగరమంగలంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసారు. విగ్రహన్ని వివిధ భాగాలుగా పగలగొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

  గంగాధర నెల్లూరుకు మండలంలోని అనంగమంగలం గ్రామంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో నంది విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ కె. ఈశ్వర్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో పలుచోట్ల హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడులు జరుగుతున్న తరుణంలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నంది విగ్రహం పురాతనమైనది కావడంతో దాని కింద ముత్యాలు, వజ్రాలు, పంచలోహాలు లభించవచ్చనే ఆలోచనతో దాన్ని తొలగించి ఉండొచ్చని డీఎస్పీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల నంది విగ్రహం కొంచెం పగుళ్లుబారిందని, దాన్ని ఆలయ ట్రస్టు సభ్యులు మళ్లీ సీసంతో అతికించారని చెప్పారు. ఆ విగ్రహం లోపల విలువైన (వజ్రాలు, పంచ లోహాలు, బంగారం వంటివి) ఉండడం వల్లే నంది విగ్రహం పగుళ్లు ఇచ్చిందంటూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దుండగులు విగ్రహాన్ని ప్రతిష్టించిన స్థానం నుంచి పెకలించారు. అనంతరం దాన్ని పగలగొట్టారు. ఈ ఘటనపై గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్స్, పోలీసు డాగ్స్‌ను రప్పించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి చెప్పారు.

  సెప్టెంబరు 5న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దివ్య రథం అగ్నికి ఆహుతయింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. అలాంటి రథం మంటల్లో కాలిపోవడంతో భక్తులు భగ్గుమన్నారు. రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేదంటే కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. అలాగే, రాష్ట్రంలోని పలు చోట్ల దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో అంతర్వేది రథం దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: