నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మనవడు నారా దేవాన్ష్‌కు ఓ మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు కుటుంబం ఆస్తులను ప్రకటించిన సందర్భంగా నారా లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే నారా దేవాన్ష్ ఆస్తులు పెరిగాయి. అయితే, అందులో తాత బాలకృష్ణ ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హెరిటేజ్ ఫుడ్స్‌లో తనకు ఉన్న 26,440 షేర్లను నారా దేవాన్ష్‌కు బహుమతిగా ఇచ్చారు. అయితే, అది ఏ సందర్భంలో ఇచ్చారో లోకేష్ తెలపలేదు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్స్ ఒక్కో షేర్ విలువ రూ.369.45 ఉంది. ఈ లెక్కన బాలయ్య ఇచ్చిన గిఫ్ట్ విలువ సుమారు రూ.97,68,258 అవుతుంది. అయితే, బాలకృష్ణ ఆ గిఫ్ట్ ఇచ్చే సమయంలో మార్కెట్ రేటు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. తక్కువ కూడా ఉండి ఉండొచ్చు. గతంలో కూడా బాలయ్య రూ.2.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను నారా దేవాన్ష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.
నారా దేవాన్ష్‌కు తాత నందమూరి బాలకృష్ణ ఖరీదైన గిఫ్ట్ ఇస్తే.. నారా లోకేష్‌కు ఆయన అమ్మమ్మ నారా అమ్మణ్ణమ్మ ఖరీదైన బహుమతి ఇచ్చారు. హైదరాబాద్ మదీనాగూడ గ్రామ పరిధిలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అది తనకు అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ అక్కడ కోట్లలో ఉంది. ఇక నారా బ్రాహ్మణికి కూడా ఖరీదైన గిఫ్ట్ లభించింది. బ్రాహ్మణి భర్త నారా లోకేష్ ఆ ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో లోకేష్‌కు రూ.1.62 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. వాటిని గత ఏడాది నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చారు.
నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తులు, అప్పుల వివరాలను నారా లోకేష్ ప్రకటించారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. అలాగే, మొత్తం అప్పులు కలిపి రూ.26.04 కోట్లుగా ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా తెలిపారు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bala Krishna Nandamuri, Chandrababu naidu, Nara Bhuvaneshwari, Nara Brahmani, Nara Devansh, Nara Lokesh