ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో వింత జంతువు కలకలం రేపింది. ఆలమూరు మండలం జొన్నాడ-పెనికేరు మద్యలోని ఓ జామ తోటలో పాడుబడ్డ నుయ్యిలో ఓ వింత జంతువును రైతులు గుర్తించారు. నీటిలో మునుగుతున్న వింత జంవుతువు దగ్గరకు వెళ్లేందుకు రైతులు సాహసించలేదు. ఇటీవల ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తూ సంచరిస్తున్న జంతువు అదేనని రైతులు భావిస్తున్నారు. నెల రోజుల్లో దాదాపు 12 లేగదూడలను ఆ జంతువు వేటాడిందని రైతులు చెప్తున్నారు. కొన్నాళ్లుగా గ్రామాల్లో సంచరిస్తూ లేగదూడలను చంపి తినేస్తోందని.. జామతోటలో సంచరిస్తుండగా పట్టుకునేందుకు యత్నించామని వెంటనే అది బావిలోకి దూకిందని రైతులు చెప్తున్నారు. సైజులో చాలా చిన్నగా ఉన్న ఆ జంతువు.. పశువులను ఎలా వేటాడుతుందో అర్ధం కావడం లేదని రైతులంటున్నారు. దీనిపై అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిపారు.
Also Read: ఒకే ఊరు.. ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నారు.. కానీ అంతలోనే...
అధికారుల స్పష్టత
రైతులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పశుసంవర్ధక శాఖ అధికారి.. నూతిలో పడ్డ జంతువును పరిశీలించారు. అది నీటి కుక్క అని తేల్చారు. నీటి కుక్క పశువులను వేటాడదని ఆయన స్పష్టం చేశారు. చేపలు, కప్పలు లాంటి చిన్నచిన్న జంతువులను వేటాడి తింటుందని తెలిపారు. నీటి కుక్కలు మనుషులను చూస్తే పారిపోతాయని.. దీని వల్ల పశువులకు గానీ, మనుషులకు గానీ ఎలాంటి ప్రమాదం ఉండదని తేల్చారు. పశువులను వేటాడే జంతువును నక్క (Golden Jackal) గా గుర్తించామన్నారు. ఖమ్మం అడవుల నుంచి జిల్లాకు వచ్చిన నక్కలు రాత్రి వేళల్లో పశువులను వేటాడుతున్నాయన్నారు. గతంలో కపిలేశ్వరపురంలో రైతులు ఓ నక్కను పట్టుకొని చంపేశారన్నారు. ఇలాంటి జంతువును ముందెప్పుడు చూడకపోవడంతో రైతులు కంగారు పడి ఉండొచ్చన్నారు.
జనావాసాల్లోకి అడవి జంతువులు..
కొన్నాళ్లుగా కపిలేశ్వరపురం, ఆలమూరు మండలాల్లోని తోటల్లో నక్కలు సంచరిస్తున్నాయి. పశువులను వేటాడుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పశువులను చంపితింటున్న జంతువుల కోసం గాలిస్తుండగా రైతులకు నీటి కుక్క తారసపడటంతో అదే వేటాడుతుందని అనుమానించారు. మనుషులను చూసిన కంగారులో అది నూతిలో దూకగా..వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. అడవులను నరికివేస్తుండటం, జంతువులను వేటాడుతుండటంతో ఆహారం కోసం కొన్ని జంతువులు ఊళ్ల మీద పడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు వంటివి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు మునుషులపైనా దాడి చేసి చంపేస్తున్నాయి. ఇటీవల విశాఖ ఏజెన్సీలో ఓ ఎలుగు గిరిజనుడిపై దాడి చేయగా.,విజయనగరం జిల్లా ఏజెన్సీలో నిత్యం ఏనుగుల మంద గ్రామాలై పడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటు చిత్తూరు జిల్లా రామకుప్పం ప్రాంతంలోనూ ఏనుగులు ఆహారం కోసం గ్రామాలపై దాడి చేస్తున్నాయి. తిరుపతి ఘాట్ రోడ్డు, పరిసర ప్రాంతాల్లోనూ చిరుతలు, ఇతర అడవి జంతువులు ఆహారం కోసం రోడ్లపైకి రావడం ఇటీవల సర్వసాధారణంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.