రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (MukeshAmbani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambai) గురువారం ఉదయం తిరుమల (Tirumala Darshan) శ్రీవారిని దర్శించుకున్నారు. కాబోయే సతీమణి రాధికా మర్చంట్‌తో కలిసి స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వారికి స్వాగతం పలికి... ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనం తర్వాత.. ఆలయ రంగనాయకుల మండపం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌కి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లకు ఇటీవలే నిశ్చితార్థం కావడంతో.. పెళ్లికి ముందు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే అసోంలోని కామాఖ్య ఆలయం, పూరీలోని జగన్నాథ్ ఆలయంలో పూజలు చేశారు. ఈ క్రమంలో ఇవాళ తిరుమలను సందర్శించిన స్వామి వారి ఆశీస్సులను పొందారు.
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి, ఆర్జిత సేవా టికెట్లపై కీలక అప్‌డేట్
ఇక, సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు. జనవరి 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేశారు. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేశారు. అంతేకాదు జనవరి 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్‌ను సైతం రద్దు చేశారు. వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయని టీటీడీ తెలిపింది.
మరోవైపు, శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండటానికి టిటిడి టైమ్ స్లాట్ టిక్కెట్లు, టోకెన్లను జారీ చేస్తోంది. అయితే ప్రతిరోజూ దాదాపు 3000 మంది భక్తులు స్లాట్ సమయాన్ని అనుసరించడం లేదు. నిర్దేశించిన సమయం కంటే చాలా ఆలస్యంగా వస్తున్నారు. ఇకపై నిర్ణీత సమయానికి రాని భక్తులను టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Tirupati