హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మీకో న్యాయం, నాకో న్యాయమా?... ఏపీ సీఎం చంద్రబాబుకి ముద్రగడ లేఖ

మీకో న్యాయం, నాకో న్యాయమా?... ఏపీ సీఎం చంద్రబాబుకి ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫోటో)

ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫోటో)

కాపు వర్గానికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకి ముద్రగడ పద్మనాభం నుంచీ సవాళ్లు ఎదురవుతున్నాయి. తన సమావేశాన్ని అడ్డుకోవడంపై ఆయన లేఖ రూపంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది.

మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31న కత్తిపూడిలో ఛలో కత్తిపూడి సమావేశం నిర్వహించాలనుకున్నారు. ఐతే... పోలీసుల అనుమతి మాత్రం తీసుకోలేదు. దాంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ... ఈ సమావేశం జరపడానికి వీల్లేదని చెప్పడంతో... ముద్రగడ దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక్కడే రాజకీయ కాక రేగింది. తాను సమావేశానికి ఎందుకు అనుమతి తీసుకోవాలంటూ... ముద్రగడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. సీఎం సమావేశాలకూ, సభలకూ అనుమతులు తీసుకోనప్పుడు... తాము ఎందుకు తీసుకోవాలంటూ లేఖలో ఘాటైన ప్రశ్నలు సంధించారు.

మూడేళ్లుగా మా జాతి కోసం జరిగిన ఉద‍్యమం గురించి ఈనెల 31న కత్తిపూడిలో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. దానిపై మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావట్లేదు. అన్ని పార్టీల నాయకులూ రోజూ రోడ్డుకు అడ్డంగా ఎన్నో సభలు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ధర్మపోరాట దీక్షలు అంటూ విజయవాడ లాంటి అతి పెద్ద పట్టణం నాలుగు రోడ్ల జంక్షన్‌లో ట్రాఫిక్‌ మళ్లించి రోడ్డుకు అడ్డంగా కుర్చీలు వేసి ఉపన్యాసాలు చెప్పారు. త్వరలో ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చెబుతున్నారు. మీరు బస్సు యాత్ర పేరుతో ఏ జిల్లాకైనా వెళ్లినప్పుడు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేస్తున్నారు. మీ అందరికీ ఒక రాజ్యాంగం... మాకు మరో రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారూ? మీ అందరిలాగా మా జాతికి స్వేచ్ఛ లేదా? మేం పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచీ వచ్చిన వాళ్లం కాదే. మేం రోడ్డుపైకి రావడానికి కారణం మీరే. నన్ను హౌస్ అరెస్టు చెయ్యడానికి వేల మంది పోలీసుల్ని పెట్టి లక్షల కోట్లు వృథా చేస్తున్నారు. దీని బదులు నన్ను సెంట్రల్ జైల్లో పెట్టండి. దుబారా ఖర్చు తగ్గుతుంది. ఇప్పటికే ఎన్నో అవమానాలు భరించాం. 1984లో ఎన్టీఆర్ గారిని బలవంతంగా ముఖ్యమంత్రి పీఠం నుంచీ తొలగించారు. మా జాతినీ, నన్ను టెర్రరిస్టుల్లా లోకానికి చూపిస్తున్నారు.
- ముద్రగడ పద్మనాభం

ఇలా ఎన్నో అంశాల్ని లేఖలో లేవనెత్తారు ముద్రగడ. దీనిపై ప్రభుత్వం స్పందించినా, స్పందించకపోయినా... ఎన్నికల సమయంలో... కాపు వర్గం నుంచీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ లేఖపై సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాల్ని బట్టీ తదుపరి కార్యాచరణ చేపట్టే ఆలోచనలో ఉన్నారు కాపు ఉద్యమ నేతలు.


Video: సాధారణ పద్ధతులతో అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Mudragada Padmanabham

ఉత్తమ కథలు