కాపు జేఏసీ నేతలకు మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఊహించని షాక్ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన కాపు జేఏసీ నేతలతో సమావేశమైన ముద్రగడ... మళ్లీ తాను కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించలేనని వారికి స్పష్టంగా చెప్పేశారు. ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన కాపు నేతలు కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వచ్చి ఈ అంశంపై చర్చించారు. సుమారు అరగంటకు పైగా కాపు ఉద్యమంపై సమాలోచనలు జరిపారు. అయితే ఈ సమావేశంలో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా విరామం తర్వాత ముద్రగడను కాపు జేఏసీ నేతలు కలవడంతో మళ్లీ ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమం మొదలుపెడతారేమో అనే ఆసక్తి నెలకొంది.
అయితే తాను మళ్లీ కాపు ఉద్యమం నడపలేనని ఆయన వారికి క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా మాత్రం తాను ఉద్యమానికి మద్దతు ఇస్తానని అన్నారు. ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దని వారికి సూచించారు. కొద్దిరోజుల క్రితమే తాను కాపు ఉద్యమ నేతగా తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఆ తరువాత కాపు రిజర్వేషన్ల ఉద్యమం చేపట్టేందుకు సీనియర్ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య వంటి వాళ్లు ముందుకొచ్చారు. అయితే వారికి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దీంతో మరోసారి ముద్రగడనే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కాపు నేతలు కోరగా.. ఆయన మాత్రం వారి వినతిని తిరస్కరించారు. దీంతో కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించబోయేది ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.