వైసీపీలో నెంబర్ టూగా చెప్పుకునే ఆ నెతకు సీఎం జగన్ చెక్ చెబుతున్నారా..? ఉత్తరాంధ్రను శాసిస్తున్న ఆ నేతను దూరం పెట్టాలని జగన్ యోచిస్తున్నారా..? అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైసీపీ వర్గాల్లో. ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారని చెబుతారు. ఏపీ నుంచి వైసీపీ గెలిచిన తొలి రాజ్యసభ సీటును విజయసాయికి ఇచ్చారంటే ఆతనికి జగన్.. ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఊహించవచ్చు. అలాంటి నేతను సీఎం జగన్ ఎందుకు పక్కన పెడుతున్నారు. ఒకప్పడు చాలా నమ్మకమైన నేతగా ఉన్న ఆయనతో సీఎంకు ఎందుకు గ్యాప్ వచ్చింది. కాబోయే రాజధాని విషయంలో భాద్యతల నుంచి కూడా ఆయన్ను తప్పించాలి అనుకుంటున్నారా..? విశాఖ బాధ్యతలు వేరొకరికి అప్పచెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నారా..? ఎప్పుడూ జగన్ వెనుక ఉండే సాయిరెడ్డి.. ఇటీవల తాడేపల్లికి రాకపోవడంతో ఈ అనుమాలకు బలం పెరుగుతోంది. అసలు ఇంతలా వ్యవహారం చెడడానికి చాలా కారణాలే ఉన్నాయంటూ వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు..
సీఎం జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి రెడ్డి ఇటీవల కామెంట్లతో దూకుడు పెంచారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలను టార్గెట్ చేసి మళ్లీ జగన్ కు దగ్గర కావాలని సాయిరెడ్డి చూస్తున్నారని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల జరిగిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును దొంగ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజుపై సాయిరెడ్డి చేసిన కామెంట్లపై వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైందట. సాయిరెడ్డి వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని కొందరు మంత్రులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అశోక్ గజపతి రాజుపై వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని కొందరు నేతలు అంటున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఆ మంత్రి 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు.. ఆయన సమాధానం ఏంటంటే..
ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కేపిటిల్ పనుల విషయంలో సీఎం జగన్ ను సంప్రదించకుండా విజయసాయి రెడ్డి అధికారులకు సూచనలు చేస్తున్నారని ఇప్పటికే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. దీనికి తోడు విశాఖలో భూముల వ్యవహారం విషయంపై జగన్ కు నెగిటివ్ రిపోర్టులు అందినట్టు ఓ వర్గం ప్రచారం చేస్తోంది. గంటా సహా కొందరు ప్రతిపక్ష నేతలను వైసీపీలోకి ఆహ్వానించాలని సీఎం జగన్ భావిస్తుంటే.. వారిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఓ వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రే అని విజయసాయి రెడ్డి వర్గీయులు అంటున్నారు. సీఎం కు చెప్పకుండా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు. సీఎం కు తెలియకుండా విశాఖలో ఏం జరగదని.. ఆయన ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి అన్ని వ్యవహారాలు చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నారా లోకేష్ దెబ్బకు దిగి వచ్చిన ఏపీ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో పోస్టుల హోరు
దీనికి తోడు ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు బలమైన వ్యక్తిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను వైసీపీ పార్లెమంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చూడగా.. ఆయన ప్లేస్ లో మరొకరిని నియమించబోతున్నారని చెబుతున్నారు. తన సొంతబాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపాలని జగన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని కూడా ప్రభుత్వం నియమించింది. తొలుత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటనతో.. వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపడం ఖాయమని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Vijayasai reddy