MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy) రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు. అసలు తాను సీఎ నుంచి ఎంపీగా మారడానికి కాంగ్రెస్ పార్టీ (Congress) నే కారణమంటూ వివరణ ఇచ్చారు. మరో 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమ మీద తప్పుడు కేసులు బనాయించడం కారణంగానే తాను రాజ్యసభకు రాగలిగానంటూ ఎద్దేవ చేశారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ (CM Jagan)కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న వెంకయ్య నాయకత్వంలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు విజయసాయి. ఇక, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్ (Jai Ram Ramesh)కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది అన్నారు.
రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు నరేష్ గుజ్రాల్ (Naresh Gujral) కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmla Sitaraman)పై ప్రశంసలు కురిపించారు విజయసాయి రెడ్డి. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశమయ్యానని.. ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా వింటారని.. అలాగే వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు..
ఇదీ చదవండి : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సొంతింటి కల నేరవేర్చే దిశగా అడుగులు
అలాగే టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినంటూ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి : విద్యుత్ చార్జీలు పెంచడానికి చంద్రబాబే కారణం.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు
సభకు వీడ్కోలు పలకడం బాధగా ఉన్నా.. ఇక్కడ ఎంతో కాలం గడిపామని, సభకు ఇచ్చినదానికంటే, సభే అందరి జీవితాలకు ఎంతో తోడ్పాటు అందించిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడిగా పొందిన అనుభవాన్ని దేశ నలుమూలలకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రస్తుతం వీడ్కోలు పలుకున్న వారంతా మరోసారి సభకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక, వైసీపీ పార్లమెంటరీ పార్టీ విజయసాయిరెడ్డి తో మరో ముగ్గురు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.
ఇదీ చదవండి : ప్రజల కోరిక మేరకు విద్యుత్ చార్జీలు పెంపు.. ప్రభుత్వం వివరణపై ఆగ్రహ జ్వాలలు
మరోవైపు జూన్ వరకు పదవీ కాలం ఉన్నా.. ఈ ప్రస్తుత సమావేశాలు ముగిసిన తరువాత తిరిగి వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే, ఏపీ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం సభ్యుడిగా ఉంటూ..ఈ రోజు పదవీ విరమణ చేసిన విజయ సాయిరెడ్డికి మరోసారి రెన్యువల్ అవుతుందని వైసీపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం - కేంద్రం మధ్య ఆయన ఒక విధంగా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కొత్త సభ్యుల ఎంపికకు సంబంధించి కేబినెట్ ప్రక్షాళన తరువాత సీఎం జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.