ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వ్యవహారం (AP Movie Tickets Issue) మరింత ముదురుతోంది. టికెట్ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం జీవో తీసుకురావడంతో పాటు అధికారులు తనిఖీలి నిర్వహించి చర్యలు తీసుకోవడం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లను అధికారులు సీజ్ చేస్తుండగా.. కొన్నింటికి జరిమానాలతో సరిపెడుతున్నారు. కొన్ని చోట్ల టికెట్ రేట్లను అధికంగా వసూలు చేస్తుండటంతో రేట్లు తగ్గించి విక్రయించాలని బోర్డులు పెట్టించారు. ఐతే అధికారుల తనిఖీలు, కఠిన చర్యలపై థియేటర్ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం థియేటర్లు నడపలేమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. రాష్ట్రంలో అక్కడక్కడా కొన్నిచోట్ల థియేటర్లను ఓపెన్ చేయడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిర్వహించాలంటే కనీసం విద్యుత్ బిల్లులు కూడా రావని కొన్ని చోట్ల ఒక్కో షోకి వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా గామీణ ప్రాంతాల్లో బాల్కనీ 15 రూపాయలు, బెంచ్ 10 రూపాయలు.. నేల టికెట్ రూ.5 రూపాయలుగా నిర్ణయించి బోర్డులు పెట్టించారు. మేజర్ పంచాయతీల్లో బాల్కనీ రూ.20, బెంచ్ రూ.15, నేల టికెట్ రూ.10గా నిర్ధారించారు. ఒక్కో సినిమా థియేటర్లో సగటను 250 నుంచి 500 సీట్ల వరకు ఉంటాయి. ఈ లెక్కన హౌస్ ఫుల్ అయినా షోకి రూ.10వేలు కూడా రావని థియేటర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు నెలకు లక్షల్లో అవుతుంటే ఈ రేట్లతో థియేటర్లు నడిపేకంటే మూసివేయడం మేలని చెబుతున్నారు. కొన్నిచోట్ల అయితే ఏపీలో టికెట్ రేట్ల కంటే తెలంగాణలో పార్కింగ్ రేట్లు అధికంగా ఉన్నాయన్న సైటైర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. కృష్ణాజిల్లాలో ఏకంగా 12 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే విజయనగరం జిల్లాలో ఆరు థియేటర్లను సీజ్ చేశారు. కొన్ని థియేటర్లకు భారీగా జరిమానాలు విధించారు.
రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సింగిల్ జడ్జి బెంచ్ పాత విధానంలోనే టికెట్లు విక్రయించుకోవాలని.. ధరల పెంపుపై జేసీ నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశించగా.. ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దీనిపై గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో తనిఖీలు నిర్వహించి సంబంధిత నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Theatres