MOTHER AND DAUGHTER SUSPICIOUS DEATH AFTER CAME FROM TEMPLE IN SRIKAKULAM DISTRICT HER PARENTS DOUBT ON HUSBAND HSN
శివరాత్రి గుడికి వెళ్లొచ్చి అందరూ పడుకున్నారు.. భార్య, ఏడాది వయసున్న కూతురు ఇంకా లేవలేదేంటని గదిలోకి వెళ్లి చూసిన ఆ భర్తకు..
ప్రతీకాత్మక చిత్రం
శివరాత్రి సందర్భంగా కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం పూట ఇంట్లోనే భోజనం చేశారు. ఆ తర్వాత కాసేపు సేదతీరదామనుకుని పడుకున్నారు. ఆ ఇంట్లో అందరూ కొద్ది సేపటి తర్వాత నిద్ర లేచారు కానీ, ఇద్దరు మాత్రం కన్నుమూశారు.
మూడేళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లయింది. శివరాత్రి సందర్భంగా గురువారం కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం పూట ఇంట్లోనే భోజనం చేశారు. ఆ తర్వాత కాసేపు సేదతీరదామనుకుని పడుకున్నారు. ఆ ఇంట్లో అందరూ కొద్ది సేపటి తర్వాత నిద్ర లేచారు కానీ, ఇద్దరు మాత్రం కన్నుమూశారు. భార్య, ఏడాది వయసున్న కూతురు మరణించారు. నిద్రపోయారనుకున్న వాళ్లు కాస్తా మరణించారని తెలిసి అంతా షాకయ్యారు. అసలేం జరిగిందో తెలియక స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ముమ్మాటికీ హత్యేనని చనిపోయిన మహిళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్తకు ఉన్న వివాహేతర సంబంధం గురించి నిలదీయడం వల్లే ఆమెను చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం కోవిలాం గ్రామానికి చెందిన లత అనే 21 ఏళ్ల మహిళకు హనుమాన్ నగర్ కు చెందిన రమేష్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. రమేష్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ ఇద్దరు దంపతులకు రెండేళ్ల తనీష్, ఏడాది వయసున్న లాస్య అనే కూతురు ఉన్నారు. గురువారం ఉదయం ఆ భార్యాభర్తలు, వారి ఇద్దరు కూతుళ్లు, రమేష్ సోదరుడు చిరంజీవి, తల్లితో కలిసి శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం అందరూ కలిసి ఇంట్లోనే భోజనం చేశారు. ఆ తర్వాత వారంతా నిద్రపోయారు. అయితే రమేష్, చిరంజీవి, వారి తల్లి కలిసి సాయంత్రం సమయంలో బయటకు వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చేసరికే భార్య ఇంకా నిద్రలేవకపోవడంతో ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. అయితే లాస్య, భార్య లత మరణించారని అప్పడే వారు గుర్తించారు. దీంతో ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భర్త రమేష్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనీ, ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తన కుమార్తెను ఆమె అత్త, భర్త, మరిది కలిసి భోజనంలో విషం కలిపి మరీ చంపేశారనీ, అభం శుభం తెలియని పసిపాపను కూడా పొట్టనపెట్టుకున్నారని లత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయం తెలిసి స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పడి ఉన్న దాన్ని బట్టి హత్యగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.