news18-telugu
Updated: September 9, 2020, 2:40 PM IST
ప్రతీకాత్మక చిత్రం
Andhra Pradesh Secretariat: ఏపీ సచివాయలం, అసెంబ్లీలో గేట్ల మూసివేత కొనసాగుతోంది. తాజాగా సచివాలయం, అసెంబ్లీలలో మరో రెండు గేట్లను అధికారులు మూసివేశారు. సెక్రటేరియట్ గేట్ 1తో పాటు అసెంబ్లీ గేట్ 2లను అధికారులు మూసివేశారు. ఈ రెండు గేట్లకు అటు, ఇటు గోడను కట్టిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రెండు గేట్లను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. వరుసగా గేట్లకు అడ్డంగా శాశ్వతంగా గోడలను నిర్మించారు. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ, సచివాలయానికి సంబంధించి మూడు గేట్లను గతంలో అధికారులు మూసి వేయించారు. వాస్తు పేరిట అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షణ గేట్లను మూసివేశారు. వాటికి అడ్డంగా గోడలు కట్టించారు. తాజాగా మరో రెండు గేట్లను అదే రకంగా మూసివేశారు. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ, సచివాలయంలో శాశ్వతంగా ఐదు గేట్లు మూతపడ్డాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పరిపాలన వికేంద్రీకరణ అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన సీఎం జగన్ ప్రభుత్వం.. కోర్టు కేసుల వ్యవహారం తేలిన తరువాత విశాఖలో సచివాలయం ఏర్పాటు చేయనుంది. దీంతో ఇప్పటివరకు అమరావతిలో కొనసాగిన ఏపీ సచివాలయం విశాఖకు తరలిపోనుంది. ఇక శాసనరాజధానిగా కొనసాగనున్న అమరావతిలో అసెంబ్లీ, శాసనమండలి మాత్రం కొనసాగనున్నాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
September 9, 2020, 2:34 PM IST