విశాఖపట్టణం (Visakhapatnam) వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం మీడియాతో ఆయన... గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit)లో ఏపీ రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావించామని.. కానీ ఏకంగా రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు.
'' ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ సదస్సు వల్ల ఏపీ సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయి. పెట్టుబడుదారుల సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిశ్రమలను స్థాపిస్తాం.'' అని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా... విశాఖలో రెండు రోజుల పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వివరించింది. సదస్సులో ఏపీ ప్రభుత్వం భారీగా ఎంవోయూలను కుదుర్చుకుంది. ఎనర్జీ విభాగంలో ఏకంగా రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3,35వేల కోట్ల, ఐటీ అండ్ ఐటీఈఎస్ కేటగిరీలో 39 వేల కోట్లు, టూరిజంలో 22 వేల కోట్లే, వ్యవసాయ విభాగంలో వెయ్యి కోట్లు, పశుసంవర్థక విభాగంలో మరో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలను ఆయన అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam