Bengal Tiger Search: ఒకటి రెండు వారాలు కాదు.. 30 రోజులు దాటింది. అయినా ఆ బెంగాల్ టైగర్ బోనుకు చిక్కడం లేదు. కాకినాడ జిల్లా (Kakinada District)లో పులి (Tiger) కోసం నెలరోజులు దాటినా.. ఫలితం ఆశాజనకంగా కనిపించడం లేదు. పరిసర ప్రాంతాల వారికి కంటిమీదు కునుకు లేకుండా చేస్తోంది. అధికారులను పరుగులు పెట్టిస్తోంది. వారి ప్రత్యేలక వ్యూహాలను అన్నింటినీ తిప్పికొడుతోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టిస్తోంది. చిక్కినట్టే చిక్కి చేజారిపోతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరా (CC Cemara) లో రికార్డు అయ్యాయి. ఎక్కడి నుంచో వచ్చింది.. కానీ కోనసీమలో తిష్ట వేసింది. ఆ పులిని బంధించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా అన్నీ చిత్తు అవుతున్నాయి. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో నెల రోజులకు పైగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి జాడ ఇంకా దొరకలేదు. శంఖవరం మండలం కొత్తమూరి పేట, లొద్దిపాలెంలో ఏర్పాటు చేసిన బోను దగ్గరకు పది రోజుల క్రితం వచ్చిన పులి, బోనులో చిక్కకుండానే తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మళ్లీ పులి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెస్క్యూ టీం సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి నెల రోజులుగా పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. టాంక్విలైజర్ గన్ వాడి పులిని స్పృహ తప్పించైనా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా అది తప్పించుకుంటూనే ఉంది.
నెల రోజులుగా పులి ఒక కారిడార్ ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పులి సంచరిస్తున్న లబ్బర్తి రిజర్వ్ ఫారెస్ట్‌ను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ పులి ఒడిషా నుంచి నాగుల కొండ మీదుగా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు చెందిన షూటర్ల సాయం కూడా తీసుకోవాలని భావిస్తున్న అధికారులు. ఇప్పటికే దీనికి సంబంధించి టీసీఏకి ప్రతిపాదనలు పంపారు.
ఇదీ చదవండి : తిరుపతి జిల్లాకు సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే.. కారణం ఏంటంటే?
ఈ పులిని పట్టుకోవడానికి మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి ఒక బృందం రాబోతుంది. అప్పటికైనా పులిని పట్టుకుంటారో లేదో చూడాలి.. ఎందుకంటే ఏపీ అధికారులు చెబుతున్నదాన్ని బట్టి ఆ పలి చాలా తెలివైనదని అర్థం అవుతోంది. సాధారణంగా పులి జాడ గుర్తించిన తరువాత.. రెండు మూడు వారాల్లోపే దాన్ని బంధిచగలుగుతారు.. కానీ ఈ పులి మాత్రం.. తెలివి తేటలు ప్రదర్శిస్తూ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kakinada, Tiger, Tiger Attack