ఓ వైపు కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను మింగేస్తుంటే.. మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక చనిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకమంది కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా.. సకాలంలో ఆక్సిజన్ అందక అనేక మంది తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలోనూ ఇదే రకమైన కారణంతో పలువురు చనిపోయారు. కరోనా ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో.. పలువురు కోవిడ్ పేషెంట్లు చనిపోయారు.
ఆస్పత్రిలోని ఎం.ఎం.1,2,3 వార్డులో ఆరుగురు మృతి చెందారు. ఐసీయూలో ముగ్గురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు మృతి చెందారు. మొత్తం 10 మంది చనిపోయారని వార్తలు వస్తున్నా.. ఎంతమంది చనిపోయారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొత్తం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక దాదాపు 20 మందికిపైగా రోగులు చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొందరు కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 45 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోవడంతోనే ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడంతో పాటు ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు 40 నిమిషాలు మొత్తం వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో లేకుండా పోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. దీంతో పలు చోట్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.