news18-telugu
Updated: August 8, 2020, 11:39 AM IST
వైసీపీకి పండగ... మరో రికార్డ్ సృష్టించిన సీఎం జగన్... కరోనా టైంలోనూ...
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చాలా అంశాలు కలిసొస్తున్నాయి. కొన్ని అంశాల్లో ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. తాజాగా... వైసీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు అంతా పండగ చేసుకోవడానికి వీలయ్యే ఓ విషయం జరిగింది. ఏంటంటే... దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి జులై 27 మధ్య... ఇండియా టుడే... మూడ్ ఆఫ్‌ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. మరి సీఎం జగన్... టాప్ 3లో ఉంటే... టాప్ 2, 1లో ఎవరున్నారన్న డౌట్ మనకు కలగొచ్చు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ టాప్ 1లో ఉన్నారు. ఇక టాప్2లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఐతే... కేజ్రీవాల్, జగన్... టాప్ 2, 3లో ఉండటం పెద్దగా ఆశ్చర్యం కలగకపోవచ్చు. ఎందుకంటే... కేజ్రీవాల్... కరోనాను బాగా కంట్రోల్ చేసి సక్సెస్ అయ్యారు. జగన్... అత్యధిక మెజార్టీ సాధించి... ఆల్రెడీ సక్సెస్ రేటులోనే ఉన్నారు. కానీ... యోగి ఆదిత్యనాత్ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో విపరీతంగా క్రైమ్ రేటు పెరుగుతోంది. గ్యాంగ్ రేప్‌లు, రకరకాల నేరాలు బాగా జరుగుతున్నాయి. అలాంటిది ఆయన టాప్‌లో ఉండటం చిత్రమే అంటున్నారు కొందరు. ఐతే... యోగి టాప్ 1లో ఉండటం ఇది వరుసగా మూడోసారి.
ఈ లిస్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో ఉండటం మరో షాకింగ్ అంశం. ఎందుకంటే... కేసీఆర్ రెండోసారి మరింత ఎక్కువ మెజార్టీతో సీఎం అయ్యారు. పైగా... వ్యవసాయానికి పెద్ద పీట వేసి... ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నారు. మరి ఆయనకు ప్రజాధరణ ఎందుకు పెరగలేదో ఇండియా టుడేనే చెప్పాలంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక మిగతా సీఎంలను గమనిస్తే... బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 4వ స్థానంలో ఉన్నారు. ఇతరులు(5), బిహార్ సీఎం నితీశ్‌కుమార్(6), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(7), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(8), రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(10) తర్వాతి పొజిషన్లలో ఉన్నారు.
19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. ఐతే... ఇలాంటి సర్వేలను కొందరు మెచ్చుకుంటుంటే... కొందరు వీటిలో వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
August 8, 2020, 11:39 AM IST