Vallabhaneni Vamsi News: రమేశ్ ఆస్పత్రి అంశంలో సినీ హీరో రామ్ చేసిన కామెంట్స్ సరికాదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఈ అంశంలో రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని ఆరోపించారు. రామ్ సినిమాలు ఒక్క అతని సామాజిక వర్గం వాళ్లు మాత్రమే చూస్తారా ? వేరే వాళ్లు చూడరా? అని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. వేరే కులం వారిని తన సినిమాలు చూడొద్దని రామ్ చెప్పగలరా అని వంశీ వ్యాఖ్యానించారు. రమేశ్ ఆసుపత్రి విచారణ వ్యవహారంలో అనవసరంగా డాక్టర్ రమేశ్ బాబు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. డాక్టర్ రమేశ్ మంచి డాక్టర్ అని.. అయితే ప్రమాదం జరిగినప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని వల్లభనేని వంశీ అన్నారు. అలా కాకుండా ఈ రకంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఎమ్మెల్యే వంశీ విమర్శలు గుప్పించారు. కులం పేరుతో ఆయన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కమ్మ కులం వారిని జగన్ సర్కార్ ఇబ్బంది పెడుతుందనే వాదన సరికాదని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి ఏమైనా పథకాలు ఆగిపోయాయా ? అని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్కడే కమ్మ సామాజికవర్గానికి నాయకుడు కాదని అన్నారు. చంద్రబాబుతోనే తమ సామాజిక వర్గానికి ముప్పు ఉందని.. బాబుకు ఉన్న సమస్యలు అన్నీ కులానికి రుద్దుతాడని ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకొచ్చాడని వంశీ అన్నారు. ఆయన మాత్రం హైదరాబాద్లో రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు పరిస్థితి రూము జూముగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.